నైరుతి రుతుపవనాల కాలం ముగిసిన తర్వాత అక్టోబర్‌లోనూ భారీ వర్షాలు కురవడంతో రాష్ట్రంలోని జలాశయాలన్నీ చాలా వరకూ నిండాయి. తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉపయోగపడే శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలను మినహాయిస్తే ఏపీలోని 13 జిల్లాల్లో ఉన్న భారీ, మధ్య తరహా జలాశయాల్లో ప్రస్తుతం 334 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. కృష్ణా డెల్టా వంటి వాటి చోట రబీ సాగుపై ఆశలు రేపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గోదావరిలో పెద్ద ఎత్తున ప్రవాహాలు వచ్చినా నీటి నిల్వకు ఎక్కడా అవకాశం లేకపోయింది. దీంతో గోదావరి డెల్టాలో రబీలో అంచనా వేసే నీటి లభ్యతపైనే రెండో పంట సాగు ఆధారపడి ఉంటుంది. కృష్ణా డెల్టాలో కొంత సాగర్, పులిచింతలపై ఆధారపడే అవకాశముంది.
ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నిండుకుండలా ఉంది. కేవలం మరో 1.446 టీఎంసీలు మాత్రమే నింపగలిగే ఖాళీ ఉంది. నాగార్జునసాగర్‌లో 1.2 టీఎంసీలే ఖాళీ ఉంది. ఈ రెండు జలాశయాల్లో కలిపి డెడ్ స్టోరేజి పోనూ 339 టీఎంసీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని అనేక భారీ, మధ్య తరహా జలాశయాలు దాదాపు మూడొంతులు నిండుగానే ఉన్నాయి. 13 జిల్లాల్లోనూ డెడ్‌స్టోరేజి పోనూ భారీ, మధ్యతరహా జలాశయాల్లో 430 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం ఉంది. అందులో డెడ్‌స్టోరేజి పోనూ 376 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ జలాశయాల్లో 334 టీఎంసీల నీరు నిండి కళకళలాడుతున్నాయి. జనవరి వరకు రుతుపవన కాలంలో కొన్ని జిల్లాల్లోనే వర్షానికి ఆస్కారం ఉంది. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజులకు ఈ నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుంది.