రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల తలెత్తిన పంట నష్టంపై (Crop Damage For Heavy Rains) వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు (Agriculture Minister Kannababu) సమీక్ష నిర్వహించారు. ముంపు తగ్గిన వెంటనే పంట నష్టం లెక్కించాలని (Enumeration) అధికారులను మంత్రి ఆదేశించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు, పంట నష్టం తీవ్రతపై ఆరా తీశారు. కడపలో శనగ, నెల్లూరులో వరిపంట దెబ్బతిన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ-క్రాప్ (E-Crop) ద్వారా పంట నష్టపోయిన రైతులను గుర్తించాలని మంత్రి కన్నబాబు సూచించారు. గోదావరి జిల్లాల్లో డ్రెయిన్లలో తూడు తొలగించాలన్నారు. సమీక్షకు 13 జిల్లాల వ్యవసాయశాఖ జేడీలు, అధికారులు హాజరయ్యారు.
వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
దక్షిణ అండమాన్ సముద్రం ఆ పరిసర ప్రాంతాలపై శనివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. నవంబరు 15 తేదీ నాటికి ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్టు అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇది మరింత బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ 18 తేదీ నాటికి కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది.