ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీటీ స్కాన్‌కు రూ.3 వేలు

రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, స్కానింగ్‌ కేంద్రాల్లో సీటీ/హెచ్‌ఆర్‌సీటీ పరీక్షకు గరిష్ఠంగా రూ.3 వేలు ధరను ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా పరీక్షకు రూ.499 కు మించి వసూలు చేస్తే రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్ ట్రస్ట్‌ సీఈవో మల్లికార్జున్ హెచ్చరించారు. కొవిడ్ పరీక్ష చేసే ప్రైవేట్‌ ల్యాబ్‌లు నిబంధనలు పాటించాలన్నారు.

సీటీ స్కాన్‌కు రూ.3 వేలు
సీటీ స్కాన్‌కు రూ.3 వేలు

By

Published : Apr 25, 2021, 9:32 PM IST

Updated : Apr 26, 2021, 5:58 AM IST

రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, స్కానింగ్‌ కేంద్రాల్లో సీటీ/హెచ్‌ఆర్‌సీటీ పరీక్షకు గరిష్ఠంగా రూ.3 వేలు ధరను ప్రభుత్వం నిర్ణయించింది. పీపీఈ కిట్లు, మాస్కులు, స్ప్రెడ్‌ సీట్లు.. ఇలా అన్నీ కలిపి పరీక్షకు ఈ ధర ఖరారు చేసింది. అంతకుమించి వసూలు చేయటానికి వీల్లేదని స్పష్టం చేసింది. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. ‘కొవిడ్‌ పాజిటివ్‌ అనుమానిత వ్యక్తులకు సీటీ స్కాన్‌ చేస్తే.... ఆ వివరాల్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొవిడ్‌ డ్యాష్‌బోర్డులో నమోదు చేయాలి. వ్యక్తి పేరు, ఫోన్‌ నంబర్‌, సీటీ ఇమేజ్‌, సంతకం చేసిన సీటీ నివేదికను అప్‌లోడ్‌ చేయాలి. ఆ సీటీ ఇమేజ్‌, నివేదిక ఆధారంగా ఆసుపత్రుల్లో చేర్చుకునేందుకు వీలుగా ఈ వివరాలు రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులకూ అందుబాటులో ఉంచాలి’ అని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ ఈ ఆదేశాలు అమలు చేయాలని, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ‘ప్రస్తుతం కరోనా రెండోదశలో పెద్ద ఎత్తున కేసులు వస్తున్నాయి. ఈ క్రమంలో సీటీ స్కాన్‌ నివేదిక ఆధారంగానూ ఆసుపత్రుల్లో ప్రవేశాలు, చికిత్స అందుతున్నాయి. అందువల్ల సీటీ స్కాన్‌ ధరలు అందుబాటులో లేకపోతే.. రోగ నిర్ధారణ మరింత ఆలస్యమై కరోనా సామూహిక వ్యాప్తికి దారితీస్తుంది. ఆ ప్రభావం వైద్య మౌలిక వసతులపై తీవ్రంగా పడుతుంది’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఎక్కువ వసూలు చేస్తే ఫిర్యాదు చేయండి: ఆళ్ల నాని

సీటీ స్కాన్‌కు ఎవరైనా రూ.3 వేలకు మించి వసూలుచేస్తే 1902 నంబరుకు ఫిర్యాదు చేయాలని ఉపముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. అలా ఫిర్యాదు అందితే ఆయా కేంద్రాల లైసెన్సు రద్దుచేస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను సూచిస్తూ ప్రతి కేంద్రంలో బోర్డులు ఏర్పాటు చేయాలని, పరీక్ష చేయించుకున్న వారికి వెంటనే బిల్లు ఇవ్వాలని చెప్పారు. కొవిడ్‌ అనుమానితులకు పరీక్షలు చేశాక పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యి, ఆసుపత్రిలో పడకలు లేవని చెబితే.. ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఆ ఆసుపత్రి బాధ్యత వహించాలన్నారు.

ఆర్‌టీపీసీఆర్‌కు రూ.499

కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే ప్రైవేటు ఆర్‌టీపీసీఆర్‌ ల్యాబ్‌లు నిబంధనలను పాటించాలని డాక్టరు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టు సీఈఓ మల్లికార్జున ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు రూ.499 మాత్రమే తీసుకోవాలని.. అంతకు మించి వసూలు చేస్తే రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తామని హెచ్చరించారు. కొత్తగా ఐసీఎంఆర్‌ఆర్‌-ఎన్‌ఏబీఎల్‌ అనుమతి పొందిన ప్రైవేటు ల్యాబ్‌లు వెంటనే ఆరోగ్యశ్రీ ట్రస్టును సంప్రదించాలని, ఎంఎన్‌ఎస్‌ పోర్టల్‌ లాగిన్‌లు పొందాలని సూచించారు. పరీక్షల ఫలితాలను ఎంఎన్‌ఎస్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు.

ఇదీచదవండి: రాష్ట్రంలో కరోనా కల్లోలం.. కొత్తగా 12,634 కేసులు, 69 మరణాలు

Last Updated : Apr 26, 2021, 5:58 AM IST

ABOUT THE AUTHOR

...view details