పాఠశాల విద్యాశాఖ తీసుకొస్తున్న 6 రకాల బడుల్లో 3, 4, 5 తరగతులకు ఒక్కోచోట ఒక్కోలా బోధనా విధానం ఉండనుంది. కొన్నిచోట్ల సబ్జెక్టు ఉపాధ్యాయులు పాఠాలు బోధించనుండగా.. మరికొన్ని చోట్ల సెకండరీ గ్రేడ్ టీచర్లతో (ఎస్జీటీ) నడిపించనున్నారు. ఇది విద్యార్థుల మధ్య అభ్యసన వ్యత్యాసాన్ని పెంచుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు 5 కి.మీ పరిధిలో 2 మాధ్యమాల్లో కొనసాగుతున్న ఉన్నత పాఠశాలల్లో ఏదో ఒక మాధ్యమాన్నే కొనసాగించాలని ప్రతిపాదించారు. ఇది తెలుగు మాధ్యమంపై ప్రభావం చూపనుంది. ప్రాథమిక బడుల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలిపేస్తే మిగిలిన 1, 2 తరగతుల బోధన కుంటుపడే ప్రమాదమూ ఉంది. పూర్వ ప్రాథమిక విద్యను (పీపీ) అంగన్‌వాడీల్లో కొనసాగించనున్నారు. మతా, శిశు సంరక్షణ కార్యకలాపాలతోపాటు అంగన్‌వాడీ కార్యకర్తలు రెండు తరగతులు బోధించాల్సి వస్తుంది.
గదులు లేని బోధన ఎలా?
నూతన విద్యా విధానం అమల్లో భాగంగా ఈ ఏడాది 250 మీటర్ల పరిధిలోని 3,627 ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతుల్ని 3,178 ఉన్నత పాఠశాలల్లో కలపనున్నారు. ఉన్నత పాఠశాలల్లో గదుల కొరత కారణంగా ఆ తరగతులను ప్రాథమిక బడుల్లోనే కొనసాగిస్తూ.. సబ్జెక్టు టీచర్లు వచ్చి ప్రత్యేక తరగతులు చెబుతారని అధికారులు పేర్కొంటున్నారు. కానీ 3, 4, 5 తరగతులకు ప్రత్యేకంగా తరగతి గదులు చాలా ప్రాథమిక బడుల్లో లేవు. అలాంటప్పుడు సబ్జెక్టు ఉపాధ్యాయుడు వచ్చినా తరగతుల నిర్వహణ కష్టంగా మారనుంది. ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1,795 సబ్జెక్టు పోస్టుల కొరత ఉంది. ఈ పరిస్థితుల్లో స్కూల్ అసిస్టెంట్లతో బోధన ఎలా అనేదానిపైనా స్పష్టత లేదు.
*ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులకు స్కూల్ అసిస్టెంట్లతో బోధన చేయిస్తామని విద్యాశాఖ చెబుతోంది. మరి ‘ఫౌండేషన్ ప్లస్’ బడుల్లో పీపీ-1 నుంచి ఐదు తరగతులుంటాయి. ఇక్కడ ఆ తరగతులు ఎవరు బోధిస్తారు? ఇప్పటికే రాష్ట్రంలోని 8వేల బడుల్లో ఒక్క ఎస్జీటీనే అన్ని తరగతులకూ బోధిస్తున్నారు. ఇలాంటి చోట ఒక్కరే ఐదు తరగతులు బోధించాల్సి వస్తుంది.
ఒక్కటే మాధ్యమం..