లాక్ డౌన్ నేపథ్యంలో తిరుమలకు వాహనాలు, భక్తుల రాకపోకలను తితిదే రద్దుచేసింది. దీంతో నిర్మానుష్యంగా మారిన తిరుమల క్షేత్రంలో చిరుతపులులు తిరుగుతూ కలకలం సృష్టిస్తున్నాయి. సోమవారం రాత్రి శ్రీత్రిదండి రామచంద్రరామానుజీయరు స్వామి మఠం సమీపంలో చిరుత సంచరించినట్లు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఇటీవల బాలాజీనగర్‌కు సమీపంలో రోడ్డు దాటుతున్న దృశ్యం కెమెరాలో చిక్కింది. రాత్రి వేళ స్థానికులు, తితిదే సిబ్బంది బయటకు రావొద్దంటూ అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
బంగారు బల్లి దర్శనం..
తిరుమలలో స్థానిక చక్రతీర్ధం వద్ద అరుదైన బంగారు బల్లి దర్శనమిచ్చింది . ప్రస్తుతం ప్రశాంతంగా ఉండడంతో బంగారు బల్లి బయటకు వచ్చినట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు
పద్మావతిలోనూ.. వన్యప్రాణులు
నెల రోజులుగా ఎస్వీయూ భవనాల చుట్టూ చేరుతున్న జింకలు, అడవిపందులు, ఇతర జంతువులు ప్రస్తుతం పద్మావతి అతిథిగృహం మీదుగా చిత్తూరుకు వెళ్లే ప్రధాన రహదారి వరకు వచ్చేస్తున్నాయి. జింకల గుంపుల్లో కొన్ని దారితప్పిపోయి తికమకపడుతున్నాయి.