తీరప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దే ప్రక్రియలో రాష్ట్రంలో కీలకమైన విశాఖ - చెన్నై పారిశ్రామిక నడవాకు సంబంధించిన పనులు జోరందుకున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు స్వర్గధామంగా విరాజిల్లుతున్న చిత్తూరు జిల్లాలో రెవెన్యూ అధికారులు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సరికొత్త ప్రణాళికలను అవలంబిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా చిత్తూరు జిల్లాలో 24వేల ఎకరాలను సేకరించాలని అధికారులకు ఆదేశాలు అందగా.... శ్రీకాళహస్తి, తొట్టంబేడు, బీఎన్ కండ్రిగ మండలాల్లో ఇప్పటికే 11 వేల ఎకరాలకు సంబంధించి ఫీల్డ్ సర్వేను రెవెన్యూ అధికారులు పూర్తి చేశారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయటంలో భాగంగా గతంలో అనుసరించిన ప్రణాళికలకు భిన్నంగా సరికొత్త మార్గాలను రెవెన్యూ అధికారులు అవలంభిస్తున్నారు.
- భూసేకరణ ముమ్మరం
గతంలో భూ సేకరణ ప్రక్రియ మొత్తం పూర్తైన తర్వాతే ఏపీఐఐసీకి రెవెన్యూ అధికారులు భూములను అప్పగించేవారు. ఈ విధానం ద్వారా పనులు నెమ్మదిగా సాగుతుండటంతో ఈ సారి ప్రత్యేక విధానాలను అవలంబిస్తున్నారు. ఏపీఐఐసీ ఎక్కడ కోరితే అక్కడ... ఆ ప్రాంతాలను ప్రాధాన్యతా క్రమంలో భూములను సేకరించి వారికి అందించేలా చర్యలు చేపట్టారు. వీటిని స్టార్టప్ ప్రాంతాలుగా గుర్తించి.... అక్కడ భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు. అలా ఇప్పటికే తొలివిడతలో మూడు మండలాల్లో 2వేల150 ఎకరాల భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి ఏపీఐఐసీకి అధికారులు అప్పగించారు. ఇప్పుడు మరో 1,350 ఎకరాలు అప్పగించాలని ఏపీఐఐసీ చేసిన విన్నపం మేరకు....క్షేత్ర స్థాయిలో భూ సేకరణను పనులను వేగవంతం చేసినట్లు రెవెన్యూ అధికారులు వివరిస్తున్నారు.