ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతి ఉప ఎన్నిక బరిలో దిగేదెవరు? - తిరుపతి ఉప ఎన్నికలపై వార్తలు

తిరుపతి ఉప ఎన్నిక బరిలో దిగేదెవరనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. 2019సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగే తొలి ఉపఎన్నిక కావటంతో ప్రధాన రాజకీయ పార్టీలు అంశాన్ని సీరియస్ గానే పరిగణిస్తున్నాయి. వైకాపా నిలబెట్టే అభ్యర్థిని బట్టే తమ నిర్ణయం ప్రకటించాలని ప్రతిపక్ష తెలుగుదేశం భావిస్తోంది. అధికార - ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పోటీకి సై అంటే...., భాజపా - జనసేనల నిర్ణయం ఏమిటనేదీ ఇప్పటి నుంచే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంతవరకూ ఎలాంటి షెడ్యూల్ ప్రకటన రాకపోయినా.. ఉప ఎన్నికంటూ జరిగితే గెలుపు మాదే అనే ధీమాతో అన్ని పార్టీలు ఉన్నాయి.

updates on tirupathi bieletions
updates on tirupathi bieletions

By

Published : Sep 30, 2020, 3:31 PM IST

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక షెడ్యూల్ ఇంకా ప్రకటించనప్పటికీ ఈ స్థానంలో నిలబడే అభ్యర్థులపై రాజకీయంగా చర్చనీయంశమైంది. తిరుపతి లోక్‌సభ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్‌ అనారోగ్యంతో మృతి చెందటంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగే మొదటి ఉప ఎన్నిక కావడంతో రాష్ట్ర ప్రజల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. వైకాపా, తెదేపాలు ఎవర్ని అభ్యర్థులుగా ప్రకటిస్తారు..?, భాజపా, జనసేన కలసి పోటీ చేస్తే ఆ పార్టీలు చూపే ప్రభావం ఎంత..? ఏ పార్టీకి ఏయే అంశాలు కలిసొస్తాయి.., గత ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానంతో పాటు, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్నీ గెలుచుకున్న వైకాపాకు ఇప్పటికీ ప్రజల్లో అదే ఆదరణ కొనసాగుతోందా? అధికార పార్టీకి సహజసిద్ధంగా ఉండే అనుకూలతల దృష్ట్యా వచ్చే ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ విజయం సాధిస్తుందా? ప్రధాన ప్రతిపక్షం తెదేపా ఏ మేరకు పుంజుకుంది? ఆ పార్టీ బలాలేంటి? గెలిచే అవకాశాలున్నాయా? వైకాపాని ఓడించేందుకు ఆ పార్టీ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుంది? తదితర అంశాలపై రాజకీయ వర్గాల్లోనూ, ఆయా పార్టీల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. తిరుపతి ఎస్సీ రిజర్వ్​డ్ లోక్‌సభ స్థానం. దాని పరిధిలో చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి శాసనసభ నియోజకవర్గాలున్నాయి.

ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారు అనారోగ్యంతోగానీ, ఏదైనా ప్రమాదంలోగానీ మరణిస్తే వారి కుటుంబ సభ్యుల్లోనే ఒకరికి టికెట్‌ ఇచ్చే సంప్రదాయాన్ని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు కొన్నేళ్లుగా పాటిస్తున్నాయి. కుటుంబ సభ్యులకే టికెట్‌ ఇస్తే.. మిగతా పార్టీలు పోటీ పెట్టకుండా, వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూసే విధానాన్ని అనుసరిస్తున్నాయి. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ బల్లి దుర్గాప్రసాద్‌ కుటుంబ సభ్యులకే టిక్కెట్‌ ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తే.. ఆయన కుమారుడు కల్యాణ్‌ చక్రవర్తికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా మరింత బలమైన అభ్యర్థిని పోటీలోకి దించాలనుకుంటే.. ప్రత్యామ్నాయాన్ని కూడా ఆలోచించే అవకాశం ఉందని సమాచారం. తిరుపతి ఉప ఎన్నికలో తెదేపా పోటీ చేస్తుందా? చేస్తే అభ్యర్థి ఎవరు అన్న విషయంలో ఇంకా అగ్రనాయకత్వం వద్ద ఎలాంటి చర్చా జరగలేదు. పార్టీ శ్రేణుల్లో మాత్రం దానిపై వివిధ రకాల చర్చలు సాగుతున్నాయి. దుర్గా ప్రసాద్‌ కుటుంబ సభ్యులకే వైకాపా టికెట్‌ ఇస్తే.. ఇప్పటి వరకు కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం తెదేపా ఎవర్నీ పోటీ పెట్టకుండా ఊరుకుంటుందా? అన్న చర్చ ప్రస్తుతం కొనసాగుతోంది. గతంలో భూమా నాగిరెడ్డి మృతి చెందడంతో నంద్యాల ఉప ఎన్నిక జరిగినప్పుడు.. వైకాపా ఆ సంప్రదాయానికి కట్టుబడలేదు కాబట్టి, తెదేపా కూడా దాన్ని పాటించాల్సిన అవసరం లేదని, తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తేనే బాగుంటుందని పార్టీ నాయకులు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ పోటీ చేయాలనే తెదేపా నిర్ణయించుకుంటే... మళ్లీ పనబాక లక్ష్మికే అవకాశం ఇస్తారా? పోటీకి ఆమె సిద్ధంగా ఉన్నారా? అన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. వైకాపా అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే, తెదేపా పోటీ చేయడంపైనా, అభ్యర్థిపైనా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

తిరుపతి ఉప ఎన్నికలో జనసేనతో కలసి పోటీ చేస్తామని భాజపా ఇప్పటికే ప్రకటించింది. భాజపా టికెట్‌ కోసం ముగ్గురు పోటీ పడుతున్నట్టు సమాచారం. ఒక మాజీ ఐఏఎస్‌ అధికారి, ఒక మాజీ మంత్రి, స్థానిక నాయకుడు మరొకరు టికెట్‌ ఆశిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్‌ నుంచి మళ్లీ మాజీ ఎంపీ చింతా మోహన్‌ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

తిరుపతి ఉప ఎన్నికలో పోటీ జరిగితే.. తమ గెలుపు మళ్లీ నల్లేరు మీద నడకేనని వైకాపా శ్రేణులు భావిస్తున్నాయి. ప్రస్తుతం తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ తమ ఎమ్మెల్యేలే ఉండటం, వాటిలో గత ఎన్నికల్లో దాదాపు అన్ని చోట్లా తమ అభ్యర్థులకు మంచి మెజార్టీలు రావడం.. అక్కడి ప్రజల్లో తమ పార్టీకి ఉన్న ఆదరణకు నిదర్శనమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతిలో పోటీ అంటూ చేస్తే తమ గెలుపు ఖాయమని తెదేపా వర్గాలూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వైకాపా నాయకులు చేస్తున్న ఇసుక అక్రమాలు, భూదందాలు, వివిధ ఛార్జీల పెంపు, ధరలు పెరగడం వంటివి, హిందూ దేవాలయాలు, ఎస్సీ వర్గానికి చెందినవారిపై దాడులు వంటివి ప్రజల్లో ఆ పార్టీ పట్ల విముఖత పెంచాయని, అవన్నీ తమకు కలసి వస్తాయని తెదేపా నేతలు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి:

తితిదే పూజా కార్యక్రమాల నిర్వహణపై హైకోర్టులో పిల్

ABOUT THE AUTHOR

...view details