కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనం నిలిపివేశారు. ప్రస్తుతానికి వారంరోజులపాటు భక్తులకు దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తుడికి కరోనా లక్షణాలు కనిపించటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
" ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్కి చెందిన దయాశంకర్ అనే వ్యక్తి.. తన గ్రామానికి చెందిన 110 మందితో తిరుమలకు వచ్చాడు. అతను 20 ఏళ్ల నుంచి సీవోపీడీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇక్కడికి వచ్చాక అతనికి తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు కనిపించాయి. వెంటనే అతడికి ఐసోలేషన్ వార్డులో చికిత్స చేశాం. అనంతరం అతని రక్త నమూనాలను పరీక్షల కోసం పంపించాం. ఆ ఫలితాలు వచ్చాక అందరితో చర్చించి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం. ముందుజాగ్రత్తగా అతనితోపాటు వచ్చిన 110 మందిని ఐసోలేషన్లో ఉంచాం. వారు ఎవరెవరిని కలిశారో వారి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నా'మని ఈవో అనిల్ తెలిపారు.