తిరుపతి రుయా ఘటన అమానవీయమైనదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కుమారుడి మృతదేహాన్ని తండ్రి బైకుపై తీసుకెళ్లిన ఘటన తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దయనీయ ఘటనకు ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. బాలుడి కుటుంబానికి పవన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. పరిపాలనా విభాగం పటిష్టంగా లేనందునే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పవన్ అన్నారు. ఓ వైద్యుణ్ణి సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకొంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు చికిత్స చేయాలా ? అంబులెన్సులు సమకూర్చాలా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా సమయంలోనూ ఆక్సిజన్ కొరతతో రోగులు చనిపోయారని గుర్తు చేశారు. విద్యుత్ కోతలతో కడప రిమ్స్‌లో రోగుల మరణాలు సంభవించాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలపై మాట్లాడిన వైద్యుడిని వేధించారని అన్నారు. ప్రభుత్వ వేధింపుల వల్ల ఓ డాక్టర్ ప్రాణాలు విడిచారని ఆరోపించారు. ప్రభుత్వ తీరు వల్లే మాఫియా జులుం చూపిస్తోందని పవన్ మండిపడ్డారు.
ఏం జరిగిందంటే..: అన్నమయ్య జిల్లా చిట్వేలికి చెందిన మామిడితోటలో కూలీగా చేసే వ్యక్తి తన కుమారుడు జైశ్వ అనారోగ్యంతో ఉండటంతో ఇటీవల తిరుపతి రుయాకు తీసుకొచ్చారు. ఆ బాలుడు చికిత్స పొందుతుండగానే కిడ్నీ, కాలేయం పూర్తిగా పనిచేయకపోవడంతో నిన్న రాత్రి 11 గంటల సమయంలో మృతిచెందాడు. బాలుడిని తిరుపతి నుంచి 90కి.మీ. దూరంలో ఉన్న చిట్వేలికి తీసుకెళ్లడానికి రుయా అంబులెన్స్ డ్రైవర్లను అడగ్గా రూ.10వేలు డిమాండ్ చేశారు.