విజయనగరం జిల్లాలోని రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం స్పష్టించింది. ఈ క్రమంలో దేవాలయంలో కొత్త విగ్రహం ప్రతిష్టించడానికి రాష్ట్ర దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. దుండగుల చేతిలో ధ్వంసమైన శ్రీరాముడి విగ్రహం పోలిన విగ్రహాన్ని తయారు చేయించడానికి శ్రీకారం చుట్టింది. తిరుపతిలో తితిదే నిర్వహణలో ఉన్న సంప్రదాయ ఆలయ నిర్మాణ, శిల్ప సంస్థలో నిపుణులైన శిల్పుల ఆధ్వర్యంలో రాముడి విగ్రహం రూపుదిద్దుకొంటోంది.
రామతీర్థంలో ధ్వంసమైన రాముల వారి విగ్రహం స్థానంలో కొత్తది తయారు చేయించేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ తితిదే ఉన్నతాధికారులకు ఇటీవల లేఖ రాశారు. తిరుపతిలోని శిల్పకళాశాలలో రాముడి విగ్రహం తయారు చేయించాలని కోరారు. పాత విగ్రహ నమూనాలను అందించారు. కాకినాడ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ భ్రమరాంబ, స్థపతులు, ఆగమ పండితులు శిల్పసంస్థను సందర్శించారు. అప్పటికే సిద్ధంగా ఉన్న విగ్రహాలను పరిశీలించారు. పాత విగ్రహం లాంటింది అక్కడ లేకపోవటంతో... రామతీర్థంలో ఉన్నలాంటిదే కొత్తదాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. స్థపతులతో విగ్రహ నమూనా వేయించారు. శిల్ప సంస్థలో ఉన్న శిల్పులు ద్వారా విగ్రహ తయారీకి చర్యలు చేపట్టారు.