ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శేషాచలంపై ఎర్రచందనం దొంగల కన్ను.. స్థానికుల దన్ను

శేషాచలంలో స్మగ్లర్లకు అడ్డంకులు తొలగిపోయాయి. అన్‌లాక్‌తో రవాణా మార్గాలు తెరచుకున్న నేపథ్యంలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. శేషాచలం కేంద్రంగా ఎర్ర చందనాన్ని పెద్దఎత్తున అక్రమ రవాణా చేస్తున్నారు. తమిళ స్మగ్లర్లకు, స్థానికుల సహాయ సహకారాలు అందుతుండగా.. అడవుల్లోకి చేరుకోవడానికి మార్గం సుగమం అవుతోంది. ఏపీ టాస్క్‌ఫోర్స్‌, అటవీశాఖ అధికారులు, పోలీసులు ఇటీవల కాలంలో వరుసగా నమోదు చేస్తున్న కేసులే ఇందుకు నిదర్శనం.

శేషాచలంపై ఎర్రదొంగల కన్ను.. స్థానికుల దన్ను
శేషాచలంపై ఎర్రదొంగల కన్ను.. స్థానికుల దన్ను

By

Published : Jul 20, 2020, 2:49 PM IST

జూన్‌లో అమల్లోకి వచ్చిన అన్‌లాక్‌ నిబంధనలతో ఎర్రచందనం స్మగ్లర్ల కదలికలు ప్రారంభమయ్యాయి. మార్చి 15 తేదీకి ముందు స్మగ్లర్లు దాచిపెట్టిన ఎర్రచందనం దుంగలను తరలించుకుపోవడానికి తొలిసారిగా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో.. కడప జిల్లాలోని బద్వేలు అటవీ ప్రాంతంలో స్థానిక, తమిళనాడుకు చెందిన స్మగ్లర్ల బృందం పోలీసులకు పట్టుబడింది. అనంతరం వరుసగా స్మగ్లర్లు తమ ప్రయత్నాలు ప్రారంభించారు.

జూన్‌ 20 తేదీన ఏపీ టాస్క్‌ఫోర్స్‌ బాధ్యుడు రవిశంకర్‌ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు బృందాలుగా ఏర్పడి శేషాచలంలో రెండు రోజుల పాటు గాలింపు చేపట్టారు. గాలించిన ప్రదేశాల్లో ఎర్ర దుంగలతోపాటు, సగం కాలిన ఎర్ర దుంగలు, వన్యప్రాణుల అవశేషాలు గుర్తించారు. ఈ పరిణామంతో.. అడవిలోకి స్మగ్లర్ల ప్రవేశం, అక్రమ రవాణా, వన్యప్రాణుల వేట జరుగుతున్నట్లు అధికారులకు కీలక ఆధారం దొరికినట్టైంది.

నమోదైన కేసులివీ

  • జూన్‌ ఒకటో తేదీ కడప జిల్లా కన్నెల వాగువద్ద స్మగ్లర్లు దాచిన 500 కిలోల బరువున్న 17 ఎర్ర దుంగలను టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
  • జూన్‌ 7న ఏపీ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఎర్ర స్మగ్లింగ్‌లో పేరుమోసిన స్మగ్లర్‌ అయ్యప్పను తిరుపతిలో అరెస్టు చేశారు.
  • జూన్‌ 11న సుమారు 300 కిలోల బరువున్న ఎర్ర దుంగలను రైల్వేకోడూరు సమీపంలో స్మగ్లర్లు దాచిపెట్టగా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
  • జూన్‌ 26న ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుత్ను మోస్ట్‌ వాంటెడ్‌ స్మగ్లర్లు శంకర్‌, సుదర్శన్‌లను టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అరెస్టు చేశారు.
  • జులై 3న ఎర్రావారిపాళెం మండలం బోడేవాండ్లపల్లె అటవీ ప్రాంతం నుంచి 212 కిలోల ఎర్ర దుంగలను తరలిస్తున్న ముగ్గురు స్థానిక స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
  • జులై 5న భాకరాపేట పోలీసులు 382 కిలోల బరువున్న ఎర్ర దుంగలను స్వాధీనం చేసుకుని పీలేరు, చిన్నగొట్టిగల్లు, చంద్రగిరి మండలాలకు చెందిన 10 మంది ఎర్ర కూలీలను అరెస్టు చేశారు.
  • జులై 10న చంద్రగిరి మండలం భీమవరం అడవుల్లో 1.5 టన్నుల బరువున్న 34 ఎర్ర దుంగలను ఏపీ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
  • జులై 15న మంగళం అటవీ ప్రాంతంలో ఏపీ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, సిబ్బంది 30 ఎర్ర దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 20 మంది తమిళనాడు స్మగ్లర్లు పారిపోయారు.

భద్రతలేని రహదారుల్లో రాక

అంతర్రాష్ట్ర అనుమతులు ఉంటేనే ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి వాహనాల రాకపోకలకు అనుమతి ఉంది. స్మగ్లర్లు ఆంధ్రా, తమిళనాడు మధ్య ఉన్న చిన్నపాటి మార్గాలను, కాలిబాటలను, ఎడ్లబండి బాటల నుంచి శేషాచలంలోకి ప్రవేశిస్తున్నారు. స్మగ్లింగ్‌కు వచ్చేవారు ద్విచక్రవాహనాలపై ఇద్దరు, ముగ్గురు చొప్పున అడవిలోకి చేరుకున్నట్టు ఇటీవల విలేకరుల సమావేశంలో ఏపీ టాస్క్‌ఫోర్స్‌ బాధ్యుడు రవిశంకర్‌ తెలిపారు. స్థానికంగా ఉండే స్మగ్లర్లు కూడా ఎర్ర దుంగల అక్రమ రవాణాలో పాల్గొంటున్నారు.

స్థానిక స్మగ్లర్ల ప్రయత్నాలు

శేషాచలం అడవుల లోపల ఉన్న రోడ్లపై స్మగ్లర్లు రాకపోకలు సాగించినట్లు ఆనవాళ్లు లేవు. కొత్తగా చెట్లను కొట్టేందుకు కాకుండా, గతంలో నరికి భద్రపరిచిన ఎర్ర దుంగలను తరలించుకు పోవడానికి స్మగ్లర్లు వస్తున్నట్లుగా పట్టుబడుతున్న కేసులను బట్టి తెలుస్తోంది. ఈ విషయంలో తమిళనాడు కంటే స్థానికంగా ఉండే స్మగ్లర్లే పాత్రే ఎక్కువగా కనిపిస్తోంది. లాక్‌డౌన్‌ ఎత్తివేత తరువాత తమిళనాడు నుంచి కొంతమంది స్మగ్లింగ్‌కు వస్తున్నట్టు తెలిసింది. అన్ని విభాగాలతో కలసి స్మగ్లర్లను కట్టడి చేస్తున్నాం.

- నాగార్జునరెడ్డి, డీఎఫ్‌వో, తిరుపతి వన్యప్రాణి విభాగం

-

ఇదీ చదవండి:

తెలంగాణ: నిమ్స్​లో కొవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్​ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details