కరోనా మహమ్మారి తిరుమల చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపింది. మార్చి 20 నుంచి తిరుమల శ్రీవారి దర్శనాలు నిలిపివేయడంతో పాటు...తిరుమలలో లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేశారు. అప్పటికప్పుడు మూసివేయడంతో అప్పటికే దుకాణాల్లో నిల్వచేసుకొన్న వస్తువులను విక్రయించుకోలేకపోయారు. ఫలితంగా దుకాణాల్లో ఉన్న వస్తువులు కొన్ని కాలం చెల్లిపోగా...మరికొన్ని దుమ్ముకొట్టుకుపోయాయి.
తీవ్ర నష్టాన్ని మిగిల్చిన లాక్‌డౌన్
సాధారణ సమయాల కంటే వేసవిసెలవుల సీజన్‌లో వ్యాపారాలు అధికంగా జరిగే అవకాశం ఉండటంతో దుకాణాల యజమానులు ఎక్కువ మొత్తంలో నిల్వలు చేసుకొన్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి రద్దీ పెరిగి వ్యాపారాలు పుంజుకొంటాయని భావించిన వ్యాపారులకు కరోనా లాక్‌డౌన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తిరుమలలో 1200 వరకు దుకాణాల్లో వివిధ రకాల వస్తువులు విక్రయిస్తుంటారు. 200 వరకు ఫ్యాన్సీ, శీతలపానీయాలు, 150 దుకాణాల్లో టీ, అల్పహారం విక్రయిస్తుండగా...మిగిలిన వాటిలో పూజా సామాగ్రి, బొమ్మలు, దేవుళ్ల చిత్రపటాలు అమ్మి ఉపాది పొందుతుంటారు.
లాక్‌డౌన్‌తో ఫ్యాన్సీ, శీతలపానీయాల దుకాణాల్లో మిగిలిపోయిన వస్తువులు కాలంతీరి....పడేయాల్సి వచ్చింది. దీంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. బొమ్మలు, దేవుళ్ల చిత్రపటాలు, పూజాసామాగ్రి విక్రయించే దుకాణదారులు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. పందులు, కోతులు వంటి జంతువులు దుకాణాల్లోకి చొరబడటంతో చిత్రపటాలు పగిలిపోయి నష్టపోయారు. కుంకుమ, పసువు, గంధం వంటి పూజా సామాగ్రి పురుగుపట్టి విక్రయించుకోలేక పోతున్నారు.