CM Jagan announcement on PRC: పీఆర్సీపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తిరుపతి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో ఉండగా.. కొందరు ఉద్యోగులు పీఆర్సీ గురించి ప్లకార్డులను ప్రదర్శించారు. వాటిని గమనించిన ముఖ్యమంత్రి.. వారిని పిలిచి మాట్లాడారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు కోరారు. ఇందుకు స్పందించిన సీఎం జగన్.. పీఆర్సీ ప్రక్రియ పూర్తయ్యిందని చెప్పారు. 10 రోజుల్లో ప్రకటన ఉంటుందని వారికి తెలిపారు.
సీఎం ప్రకటన గురించి తెలియదు - బొప్పరాజు
పీఆర్సీపై సీఎం జగన్ తాజా ప్రకటనపై ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు స్పందించారు. పీఆర్సీపై సీఎం చేసిన ప్రకటన గురించి ఉద్యోగులకు తెలియదన్నారు. తిరుపతిలో తమ సంఘాల ఉద్యోగులెవరూ ముఖ్యమంత్రిని కలవలేదని స్పందించారు. పీఆర్సీ ఒక్కటే ఉద్యోగుల డిమాండ్ కాదన్న ఆయన.. తమ డిమాండ్లు అన్నీ అంగీకరిస్తేనే పోరాటం విరమిస్తామని స్పష్టం చేశారు. పీఆర్సీ నివేదిక ఇస్తేనే దానిపై చర్చకు వీలు కలుగుతుందని చెప్పారు.