ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆలయ ఆకృతి మార్పులకు తితిదే ఆగమ సలహా మండలి అంగీకారం - Changes in the designs of the tirumala temple updates

తిరుమల శ్రీవారి ఆలయ ఆకృతుల్లో పలు మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో స్వామివారి ప్రసాదాలు అందజేసే వగపడి ప్రాంగణం, రంగనాయకుల మండపంలో గోడ తొలగించారు. దీనికి తితిదే ఆగమ సలహా మండలి అంగీకారం తెలిపింది.

ttd
ttd

By

Published : Mar 16, 2021, 9:03 AM IST

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో పలు నిర్మాణపరమైన మార్పులు చేసేందుకు తితిదే సిద్ధమవుతోంది. స్వామివారి ప్రసాదాలు అందజేసే వగపడి ప్రాంగణంతోపాటు రంగనాయక మండపం వద్ద గల ఇటుక గోడను తొలగించనున్నారు. దీనిపై ఇప్పటికే ఆగమ సలహా మండలితో చర్చించారు. ఆలయం ఈశాన్య భాగంలో వగపడి ప్రాంగణం ఉంది. ఇక్కడ ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు పెద్ద లడ్డూలతోపాటు, వడలు, ఇతర ప్రసాదాలు పంపిణీ చేసేవారు. అక్కడ భక్తుల రద్దీ వల్ల ఇరుగ్గా మారిందని భావించిన తితిదే.. గతంలోనే ప్రసాదాల పంపిణీని ఆలయం వెలుపల ఉన్న లడ్డూ పంపిణీ కేంద్రానికి మార్చింది.

ప్రస్తుతం ఈ గదుల్లో అధికారిక దస్త్రాలతోపాటు కొన్ని వస్తువులను భద్రపరిచారు. దీనివల్ల ఆలయ ఆకృతి సరిగా కనిపించడం లేదని, వగపడి ప్రాంగణాన్ని పూర్తిగా తొలగించడం వల్ల మరింత విశాలంగా ఉండటంతోపాటు ఆర్కిటెక్చర్‌ (ఆకృతి) బాగుంటుందని చెబుతున్నారు. ఇక, ఆగ్నేయ భాగంలోని రంగనాయకుల మండపం పక్కనే ఉన్న స్థలాన్ని సీసీ టీవీ కెమెరాల పరిశీలన, విద్యుత్తు, అటవీ శాఖ అధికారుల వస్తువులు, తాపీ పనుల పరికరాలు భద్రపరిచేందుకు ఉపయోగిస్తున్నారు. వీటివల్ల చూసేందుకు బాగా లేదని భావించారు.

మండపం, గది మధ్యభాగంలో ఉన్న కారిడార్‌ను కల్యాణోత్సవ భక్తుల కోసం వినియోగిస్తున్నారు. ఈ గది ఇటుక గోడలను తొలగించాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలను ఆగమ సలహా మండలి సభ్యులు ఎన్‌.ఎ.కె.సుందరవదన్‌, ఎ.వేణుగోపాల దీక్షితులు, ఎన్‌.వి.మోహనరంగాచార్యులు, ఎ.అనంతశయన దీక్షితులు పరిశీలించారు. శిలా సంబంధమైన గోడలు, మండపాలు కాకుండా సిమెంట్‌ కట్టడాల తొలగింపునకు అభ్యంతరం లేదని వారు సూచించారు.

వర్క్స్‌ కమిటీ సిఫార్సులపై మరో కమిటీ

ఆగమ సలహా మండలి అభిప్రాయాన్ని తితిదేలోని వర్క్స్‌ కమిటీకి ప్రతిపాదించారు. పూర్వాపరాలు పరిశీలించిన ఈ కమిటీ ఈశాన్య భాగంలోని వగపడి ప్రాంగణాన్ని తొలగించేందుకు ఆమోదించింది. రంగనాయక మండపం తూర్పు భాగంలో ఉన్న ఇటుక గోడలు తొలగించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ ప్రతిపాదనలపై ఇటీవల జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. వర్క్స్‌ కమిటీ సిఫార్సులను పరిశీలించి 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాల్సిందిగా పేర్కొంటూ తితిదే పాలకమండలి సభ్యులైన డాక్టర్‌ జె.రామేశ్వర్‌రావు, రమేష్‌ శెట్టి, ఐఐటీ నుంచి ఒక నిపుణుడు, అదనపు ఈవోలతో మరో కమిటీ వేశారు. ఈ కమిటీ ఇచ్చే నివేదికను బట్టి తదుపరి అడుగులు పడనున్నాయి.

ఇదీ చదవండి:మేయర్లు, ఛైర్మన్ల పీఠాలపై సీఎం కసరత్తు

ABOUT THE AUTHOR

...view details