తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో అభ్యర్ధులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. వైకాపా తరఫున మంత్రులు, కీలక నేతలు ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. వైకాపా అభ్యర్థి గురుమూర్తి తరఫున చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో..మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, ద్వారకనాథరెడ్డిలు ప్రచారం నిర్వహించారు. రోడ్ షో నిర్వహించి గురుమూర్తిని భారీ ఆధిక్యంతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్ అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన మంత్రి కన్నబాబు..స్థానికపోరులో మద్దతిచ్చినట్లుగానే ఉపఎన్నికలోనూ మరోసారి ఆశీర్వదించాలని కోరారు. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి గురుమూర్తి పాటుపడతారని భరోసా ఇచ్చారు.
తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మి.. నెల్లూరు జిల్లాలోని గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. పొలం పనుల్లో ఉన్న రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న రైతులను పలకరించారు. గ్రామాల్లోని పార్టీ సీనియర్ నేతలను కలుసుకుని ప్రచార వ్యూహంపై దిశానిర్దేశం చేస్తున్నారు. కలువాయి మండలంలో నిర్వహించిన ప్రచారంలో మాజీ మంత్రి దేవినేని ఉమ పాల్గొన్నారు. వైకాపా పాలనలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతుండగా.. భాజపా హయాంలో పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు మండిపోతున్నాయని విమర్శించారు. ప్రజలపై భారం మోపుతున్న ఈ రెండు పార్టీలకు కాకుండా.. పార్లమెంట్‌లో పోరాడే తెలుగుదేశానికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.