తిరుమలలో భక్తులు తిరిగే ప్రాంతంలో చిరుత సంచరించడం కలకలం రేపింది. శ్రీవారి ఆలయ పశ్చిమ మాఢవీధి వెనుక వైపు ఉన్న మ్యూజియం వద్ద చిరుత సంచరించింది. మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకొంది. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుత... మ్యూజియం ప్రహరీ గోడపై చాలాసేపు ఉంది. అనంతరం గోడ దూకి మ్యూజియం ముందు భాగంలో భక్తులు నడిచేందుకు నిర్మించిన పాదబాటపై సేద తీరింది. కాసేపటి తర్వాత అడవిలోకి పారిపోయింది. ఆ సమయంలో భక్త సంచారం లేకపోవటంతో ప్రమాదం తప్పింది.
తిరుమలలో ఇటీవల వన్యమృగాల సంచారం అధికమవటంతో వాటి సంచారాన్ని పసిగట్టడానికి తితిదే ప్రత్యేక చర్యలు చేపట్టింది. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కెమెరాలను అమర్చారు అధికారులు. వాటి ముందు జంతువుల కదలికలు ఉంటే భద్రతా సిబ్బందిని అలారం ద్వారా అప్రమత్తం చేస్తాయి. ఇలా మంగళవారం రాత్రి మ్యూజియం సమీపంలో చిరుతను గుర్తించారు.