ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AQUA FARMERS PROBLEMS: రాష్ట్రానికి ఆదాయం ఫుల్​... ఆక్వా రైతులకు లాభాలు నిల్... - STATE AQUA FARMERS PROBLEMS

AQUA FARMERS PROBLEMS :రాష్ట్రంలో ఇతర రంగాలతో పోల్చితే ఆక్వా రంగం మెరుగైన అభివృద్ధి సాధిస్తోంది.కానీ, ప్రభుత్వం మాత్రం చర్యలు అంతంతమాత్రంగానే తీసుకుంటోంది. కొన్నేళ్లుగా రైతులు ఆందోళనలు చేస్తున్నా.. పట్టించుకోవడం లేదు. ఆర్థికంగా రాష్ట్రాన్ని మందుకు నడిపిస్తున్న రైతులకు అనుకున్నస్థాయిలో లాభాలు పొందకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంత కష్టపడుతున్నా... పెరిగిన ధరలతో ప్రయోజనాలు చేకూరడం లేదని ఆక్వా రైతులు వాపోతున్నారు. సన్నకారు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆవేదన చెందుతున్నారు.

PROBLEMS OF AQUA FARMERS
ఆక్వా రైతుల సమస్య

By

Published : Feb 3, 2022, 2:08 PM IST

AQUA FARMERS PROBLEMS: ఆక్వారంగం అభివృధ్ధికి ప్రభుత్వం అంతంతమాత్రంగానే చర్యలు తీసుకుంటోంది. మూడేళ్లుగా రొయ్యల మేతల ధరలు పెరుగుతున్న తీరుపై రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై చర్యలు చేపడుతుందని ఆశించినా భంగపాటు తప్పడం లేదు. లక్ష్యాన్ని మించి ఉత్పత్తులు సాధిస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు నడిపిస్తూ విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నా నాయకులకు పట్టడం లేదు. ఆక్వారైతులు ఇబ్బందులను అధిగమించలేక అప్పుల బాట పడుతున్నారు. వ్యాధుల తీవ్రత, నీటికొరత, మౌలిక వసతుల లేమి, నూతన పరిజ్ఞానం అందుబాటులో లేక ఐదారేళ్లుగా నష్టాల బాటలో పయనిస్తున్నారు. అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు ప్రోత్సాహకం అందించకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో జిల్లా రైతులు ఉన్నారు.

ఆక్వారంగంలోని రొయ్యలు, చేపల సాగుకు సంబంధించి అధికశాతం రైతులు ఒక్క మేతలకే ఖర్చుచేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై గత సంవత్సరం ప్రభుత్వం దిగుమతి సుంకం 15శాతం నుంచి 30శాతానికి పెంచింది. దీనివల్ల ఒక్కో కిలో మేతకు రూ.4 నుంచి 7 వరకు మేతల కంపెనీలు ధరలను పెంచాయి. అదనపు భారాన్ని మోయలేక రైతులు సుంకాన్ని తగ్గించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. బ్రూడ్‌స్టాక్‌ దశలో వాడే మేతల సుంకాన్ని 30 నుంచి 15శాతానికి మాత్రమే తగ్గించాయి. జిల్లాలో రోజూవారీగా లక్ష కిలోల వినియోగం ఉంటుంది. దానిని తగ్గించకుండా కేవలం 100 కిలోలలోపు వినియోగించే బ్రూడ్‌స్టాక్‌ మేతలకు తగ్గించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు.

ఘనమైన అభివృద్ధి..

ఇతరరంగాలతో పోల్చితే ఆక్వారంగం మెరుగైన అభివృధ్ధి సాధిస్తోంది. జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో ఈసాగు ఉండగా అందులో 1.20 లక్షల ఎకరాల్లో చేపలు, 60వేల ఎకరాల్లో రొయ్యలు సాగవుతోంది. పెద్దఎత్తున రొయ్యల దిగుబడులను సాధించి విదేశాలకు ఎగుమతి చేసి విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జించడంతోనే తలసరి ఆదాయం పెరుగుదలకు కారణమవుతోంది. చేపల సాగులోనూ మెరుగైన దిగుబడులు సాధించడంతో రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు..

ఎంత కష్టపడుతున్నా..

"రొయ్యలసాగులో కష్టపడుతున్నా పెరిగిన ధరలతో ప్రయోజనం చేకూరడం లేదు. గతేడాదితో పోల్చితే డీజిల్‌కే అదనంగా చెల్లిస్తున్నాం. మేతల 25 కిలోల కట్టకు రూ.125 చెల్లించాల్సిన పరిస్థితి. పెరిగిన ధరలస్థాయిలో రొయ్యల ధరలు పెరగడంలేదు. రెండు పంటలు పోయి లాటరీ రూపంలో వచ్చే ఒక పంటలో నష్టాలు భర్తీకావడం లేదు. సన్నకారురైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వారివద్దకు చేరడం లేదు." - నాగరాజు, రొయ్యల రైతు మండవల్లి

నిరాశ పరిచారు...

"ఏటా చేపల, రొయ్యల ధరలు పెరగకపోయినా మేతల ధరలు మాత్రం పెరగడం లేదు. దీంతో ఆక్వారైతులకు నష్టాలు తప్పడం లేదు. దిగుమతి సుంకాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వాలను కోరుతున్నాం. రైతులందరూ ఏటా చెల్లిస్తున్న రూ.వెయ్యికోట్ల్ల దిగుమతి సుంకాన్ని తగ్గించమని అడిగితే..రూ.10కోట్ల విలువైన బ్రూడ్‌స్టాక్‌ మేతల సుంకాన్ని తగ్గించారు. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నష్టాలను దిగమింగుకుని సాగుచేయాల్సిన పరిస్థితి నెలకొంది." -చదలవాడ శేషగిరిరావు, రాష్ట్ర చేపల సంఘం ఉపాధ్యక్షుడు

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని తమ గోడును విని.. సమస్యలు తీర్చాలని ఆక్వా రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇదీ చదవండి: ఉద్యోగ, ఉపాధ్యాయుల నినాదాలతో మారుమోగుతున్న బీఆర్‌టీఎస్ రోడ్డు

ABOUT THE AUTHOR

...view details