కృష్ణా జిల్లాలో..
కరోనా నియంత్రించడాన్ని గాలికొదిలేసి, రాజకీయ ప్రయోజనాల కోసం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం సిగ్గుచేటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్. బాబూరావు అన్నారు. వ్యాక్సిన్ పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వ తీరు అస్తవ్యస్తంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీకా పంపిణీని పరిశీలించిన ఆయన ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో..
కోనసీమ ప్రాంతంలో విస్తారంగా చమురు గ్యాస్ తవ్వకాలు చేపట్టి కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సామాజిక బాధ్యతతో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు డిమాండ్ చేశారు. నేటి నుంచి మూడు రోజుల పాటు చమురు సంస్థల కార్యాలయాల వద్ద దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఈ నిరసనను పోలీసులు అడ్డుకున్నారు.
కర్నూలు జిల్లాలో..
నంద్యాల ప్రభుత్వ వైద్యశాల కొవిడ్ వార్డులో పడకల సంఖ్య పెంచాలని అవాజ్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్డీవో కార్యాలయ అధికారికి ఆవాజ్ కమిటీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతమున్న 60 పడకలను 200కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. పడకల కొరత కారణంగా కరోనా రోగులు మృతి చెందినట్లు వారు అన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతపురం జిల్లాలో..
పుట్లూరు మండలంలో కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం నేతలు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల అధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు 24 గంటలు రోగులకు అందుబాటులో ఉండాలని.. స్థానికంగా వారు నివాసముండాలని కోరారు. మండలంలో అన్ని హైస్కూళ్లను ఐసోలేషన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి:
ట్విట్టర్ కార్యాలయాలపై దిల్లీ పోలీసుల సోదాలు
డిశ్చార్జి సమ్మరి వచ్చాకే రఘురామ విడుదల