ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దూసుకొస్తున్న నివర్...ఎటు వెళ్తుందంటే?

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను....తీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రేపటికి పెను తుపానుగా మారి తమిళనాడు తీరంలోని కరైకల్ - మామల్లపురం వద్ద తీరం దాటుతుందని స్పష్టం చేసింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలోని నెల్లూరు, రాయలసీమలోని చిత్తూరు జిల్లా తీవ్రంగా ప్రభావితం అవుతాయని హెచ్చరికలు జారీ చేసింది. అటు తమిళనాడులోని కోస్తా జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. నివర్ తీరాన్ని దాటే సమయంలో 120 -130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.

Niver cyclone
Niver cyclone

By

Published : Nov 24, 2020, 6:54 PM IST

Updated : Nov 24, 2020, 8:22 PM IST

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను క్రమంగా తీరం వైపు దూసుకువస్తోంది. తుపాను ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 380 కిలోమీటర్లు, చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం తెలియజేసింది. ఇది క్రమంగా గంటకు 5 కిలోమీటర్ల వేగంతో తీరం వైపునకు వస్తోందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. రాగల 12 గంటల్లో మరింతగా బలపడి తీవ్ర తుపానుగా మారుతుందని ఐఎండీ స్పష్టం చేసింది. అనంతరం పెనుతుపానుగా మారే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసింది. పెనుతుపానుగా మారిన అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 25వ తేదీ సాయంత్రానికి పుదుచ్చేరికి దగ్గరగా మామల్లపురం - కరైకల్ మధ్య తీరాన్ని దాటుతుందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.

దూసుకొస్తున్న నివర్

120-130 కిలోమీటర్ల వేగంతో గాలులు

నివర్ తీరాన్ని దాటే సమయంలో 120 -130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలోని నెల్లూరు, రాయలసీమలోని చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర తమిళనాడు జిల్లాలైన పుదుకొట్టై, తంజావూర్, తిరువరూర్, కరైకల్, నాగపట్నం, విల్లుపురం, తిరువణ్ణమలై, చెంగల్ పట్టులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దక్షిణ బంగాళాఖాతం తీరంలో ఈదురుగాలుల ప్రభావం మొదలైనట్టు ఐఎండీ తెలియచేసింది. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో 65-75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని స్పష్టం చేసింది.

నివర్ తుపాను తమిళనాడు తీరంలోని కరైకల్ -మామల్లపురం వద్ద తీరం దాటే అవకాశం

సముద్రం అల్లకల్లోలం

తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారినట్టు వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ ప్రాంతాల్లో 1.5 నుంచి 2 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేసింది. తీరప్రాంత జిల్లాల్లోని సమాచార, విద్యుత్ లైన్లతో పాటు పూరిళ్లు ఇతర టవర్లు దెబ్బతినే ప్రమాదముందని విపత్తు నిర్వహణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. నెల్లూరు, చిత్తూరు సహా తీరప్రాంత జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్తగా తీర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు.

ఇదీ చదవండి :

నివర్ తుపాన్: నెల్లూరు, రాయలసీమకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన

మరింత తీవ్రంగా మారిన వాయుగుండం.. కోస్తా, సీమపై ప్రభావం

తుపాన్ ప్రభావం దృష్ట్యా అప్రమత్తంగా ఉండండి: సీఎం జగన్

Last Updated : Nov 24, 2020, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details