ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెన్నాకు వరదపోటు...జలదిగ్బంధంలో నెల్లూరు

నెల్లూరు జిల్లాకు ఆహ్లాదాన్ని పంచే పెన్నానది తీరంలో వరద కల్లోలం రేగింది. పెన్నాకు వరద పోటెత్తడంతో నెల్లూరు నగరంతోపాటు సమీప గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి. తల్పగిరి రంగనాథుడి గర్భగుడిలోకీ నీరు చేరింది. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మంత్రి అనిల్‌ త్వరలోనే ముంపు కాలనీలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.

Nellore
Nellore

By

Published : Nov 28, 2020, 6:03 AM IST

పెన్నాకు వరదపోటు...జలదిగ్బంధంలో నెల్లూరు

నివర్ ‌తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు సోమశిలలోకి ప్రవాహం పోటెత్తుతోంది. ఆ నీటినంతా అధికారులు గేట్లెత్తి పెన్నా నదిలోకి విడుదల చేస్తున్నారు. ఫలితంగా ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తూ పరివాహక ప్రాంతాలను ముంచెత్తింది. నెల్లూరు నగరంలో పెన్నానదిని ఆనుకుని ఉన్న అనేక కాలనీలు ఇప్పుడు జలదిగ్బంధం అయ్యాయి. ఇందులో అనుమతులతో నిర్మించుకున్న ఇళ్లతోపాటు అక్రమంగా కట్టుకున్న గూళ్లూ ఉన్నాయి. ఇప్పుడవన్నీ చెదిరిపోయాయి. ప్రధానంగా జయలతానగర్, వెంకటేశ్వరపురం, ఈద్గామిట్ట, రాజీవ్ గాంధీకాలనీ మునిగాయి. ప్రవాహం ఉన్నట్టుండి చుట్టేయడంతో కట్టుబట్టలతో మిగిలామని ముంపు బాధితులు వాపోతున్నారు.

సామాన్య ప్రజలకే కాదు దేవుడికీ వరద కష్టాలు తప్పలేదు. పెన్నానది ఒడ్డునున్నతల్పగిరి రంగనాథుడినీ వరద చుట్టుముట్టింది. ఆలయం వెనుక నుంచి ప్రాకారంలోకి నీళ్లు ప్రవేశించాయి. గర్భగుడిలోకీ వెళ్లాయి. రంగనాథ ఆలయంతోపాటు వరద ప్రభావిత ప్రాంతాలను జలవనరుల మంత్రి అనిల్ పరిశీలించారు. సాలుచింతల వద్ద కోతకు గురవుతున్న పొర్లుకట్టకు మరమ్మతులు చేయించాలని అధికారుల్నిఆదేశించారు. ముంపుబాధితుల పునరావాస కేంద్రాలను తనిఖీ చేశారు. 4 వేలమందిని పునరావాస శిబిరాలకు తరలించామన్న మంత్రి వరద తగ్గిన వెంటనే సహాయక చర్యలు చేపడతామని చెప్పారు. పెన్నా వరదను తట్టుకునేలా నెల్లూరులో రింగ్‌బండ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

నెల్లూరు జిల్లా సంగం మండలంలోని పలుగ్రామాలనూ పెన్నానది.. ముంచెత్తింది. పెరమన వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరడంతో నెల్లూరు నుంచి కడప వైపు రాకపోకలు ఆపేశారు. అనంతసాగరం మండలం పి కె పాడు ఇసుక రేవులో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది పెన్నా నదిలో చిక్కుకోగా.. వారిని పోలీసులు స్థానిక జాలర్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు.

ఇదీ చదవండి :రైతులపై అట్రాసిటీ కేసులో సరైన కారణాలు చూపలేదు: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details