ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్వర్ణముఖి కాజ్‌వేపై ఢీకొన్న ద్విచక్ర వాహనాలు, ఇద్దరు మృతి...

నెల్లూరు జిల్లా తిమ్మాజీకండ్రిగకు సమీపంలో స్వర్ణముఖి కాజ్‌వేపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఒక పాప నదిలో పడి గల్లంతైంది. పాప కోసం.. సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్సై డి.వెంకటేశ్వరరావు తమ బృందంతో గాలిస్తున్నారు.

Motorcycles collide on Swarnamukhi Causeway at nellore district
స్వర్ణముఖి కాజ్‌వేపై ఢీకొన్న మోటారుసైకిళ్లు

By

Published : Dec 13, 2020, 11:53 AM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తిమ్మాజీకండ్రిగకు సమీపంలో స్వర్ణముఖి కాజ్‌వేపై రెండు మోటార్‌సైకిళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఒక పాప నదిలో పడి గల్లంతైంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణ పరిధిలో తుమ్మూరుకు చెందిన మురళి, సుజాతమ్మ దంపతులు తమ కుమార్తె ప్రవల్లికతో కలిసి మోటార్‌సైకిల్‌పై రాత్రి 8 గంటల సమయంలో స్వర్ణముఖి తీరంలో ఉన్న ఆలయానికి వెళ్లి, తిరిగి వస్తున్నారు. ఇదే మార్గంలో వీరికి ముందుగా మేనకూరు గ్రీన్‌టెక్‌ పరిశ్రమలో పని చేస్తున్న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన దుంప త్రినాథ్‌, విశాఖపట్నానికి చెందిన సాయి, పెళ్లకూరు మండలానికి చెందిన నాగూర్‌సాహెబ్‌ మోటార్‌సైకిల్‌పై వస్తున్నారు. ఎదురుగా కారు వస్తుండటంతో మోటార్‌సైకిళ్లు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో మురళి, సుజాత దంపతులు తమ కుమార్తెతో సహా నదిలో పడిపోయారు. దంపతులు గట్టుకు చేరుకున్నా.. పాప గల్లంతైంది. కార్మికులు కొంత దూరంలో పడిపోయారు. గాయాలైన వీరిని నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ త్రినాథ్‌, సాయి మరణించారు. నాగూర్‌సాహెబ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

చిన్నారి కానరాక..
మురళి, సుజాత దంపతుల ఏకైక కుమార్తె ప్రవల్లిక. అల్లారుముద్దుగా చూసుకుంటున్న కుమార్తెతో కలసి ప్రతి శనివారం వేంకటేశ్వరుని ఆలయంలో పూజలకు వెళ్తారు. ఇలాగే వెళ్లి వస్తూ ప్రమాదానికి గురయ్యారు. నదిలో పడిన పాప ఆచూకీ రాత్రి 11.30 వరకు తెలియలేదు. ఆ తల్లిదండ్రుల రోదన చూపరులను కలచివేస్తోంది. సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్సై డి.వెంకటేశ్వరరావు తమ బృందంతో గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details