Jagananna Colony in Nellore District: పేదలందరికీ ఇళ్లస్థలాలు ఇచ్చామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రం విఫలమైంది. నెల్లూరు జిల్లా కోవూరులోని పోతిరెడ్డిపాలెం తిప్పకాలనీలో 150 ఇళ్లు మంజూరు చేశారు. స్థలం ఎంపికలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. లోతు ఎక్కువ ఉన్న స్థలాలను ఇచ్చారు. దాంతో వర్షం వచ్చిందంటే చాలు లేఔట్ చెరువును తలపిస్తోంది. రోడ్లన్నీ మునిగిపోతున్నాయి. ఒక్కో ఇంటికి 50 ట్రిప్పుల మట్టి తోలాల్సి ఉంటుంది. కనీసం ఎత్తు పెంచడానికే లక్షన్నర రూపాయలు ఖర్చు అవుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు.
ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఏమాత్రం సరిపోవడం లేదంటున్నారు. స్థలం ఇచ్చాం కదా కొంత సొమ్ము పెట్టుకుని సొంతింటి కల నెరవేర్చుకోండంటూ అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారని చెబుతున్నారు. రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించలేదని.. మంచినీరు, విద్యుత్ సమస్యలు ఉన్నాయని తెలిపారు.