Fire Accident in Mushroom Industry : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామ సమీపంలోని పుట్టగొడుగుల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
స్థానికులు, పోలీసుల కథనం మేరకు..
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామ సమీపంలోని పుట్టగొడుగుల తయారీలో భాగంగా పరిశ్రమలో రెండు వేల టన్నుల వరిగడ్డిని నిల్వ ఉంచారు. బుధవారం సాయంత్రం ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడ పని చేసే సిబ్బందితో పాటు స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో హుటాహుటిన రెండు అగ్నిమాపక వాహనాలు చేరుకున్నాయి. మంటలు, దట్టమైన పొగ కమ్మేయటంతో అక్కడ పని చేసే కార్మికులు పరుగులు తీశారు. 200 మంది జిల్లా వాసులు, 50 మంది స్థానికేతరులు పని చేస్తున్నట్లు సమాచారం. అందులో పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతా సమీపంలోని రాంపూర్ గ్రామానికి చెందిన సాదలిమొల్ల, పారులిబీబీ దంపతుల ఐదేళ్ల చిన్నారి కనిపించకపోవటంతో ఆమె మంటల్లోనే చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిని వెతికేందుకు జేసీబీల సహాయంతో వరిగడ్డిని తొలగిస్తున్నారు. మంటలను పూర్తిగా ఆర్పేందుకు నాలుగు రోజులు పడుతుందని స్థానికులు అంటున్నారు.