ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. వాలంటీర్ల ద్వారా అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యంగా కొత్త వ్యవస్థను తీసుకు రాబోతుంది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. పరీక్షలో సామాజిక స్పృహ, వర్తమాన వ్యవహారాలు, జనరల్ అవేర్నెస్, ఆటిట్యూడ్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని అధికారులు తెలిపారు.
కాకినాడలో
కాకినాడలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇంటర్వ్యూలకు నగర పాలక సంస్థకు వచ్చారు. నగరంలో రోజుకు 250 మంది చొప్పున ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు.
జీలుగుమిల్లిలో
పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలకు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో బాలాజీ, ఇంచార్జ్ తహసీల్దార్ సత్యనారాయణ, ఎంఈఓ శ్రీనివాసరావు, ఈఓ కొండల్ రావు ముఖాముఖి జరిపారు. మండలంలోని అంకంపాలెం, రాజవరం, స్వర్ణ వారి గూడెం పంచాయతీలు చెందిన 26 మంది గిరిజన అభ్యర్థులు ముఖాముఖిలో పాల్గొని వివరాలు సమర్పించారు.
విజయవాడలో ఆలస్యంగా
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వలంటీర్ల మౌఖిక పరీక్షలు విజయవాడ నగరపాలక సంస్థలో ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. వాస్తవానికి ఉదయం 10 గంటలకే ఇంటర్వ్యూలు ప్రారంభంకావాల్సి ఉంది. కానీ అధికారులు ముందు రోజు ఏర్పాట్లు చేయడంలో జాప్యమైనందున ఇంటర్వ్యూలు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యాయి. దీంతో స్లాట్ ప్రకారం ఉదయం 10 గంటలకే వచ్చిన అభ్యర్థులు... ఇంటర్వ్యూ కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది. మరోవైపు ఏ వార్డుకు... ఎక్కడ ముఖాముఖిలు నిర్వహిస్తున్నారో తెలియక అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు.
మార్కాపురంలో విశేష స్పందన
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ, వార్డు వాలంటీర్ల మౌఖిక పరీక్షకు విశేష స్పందన లభించింది. ఈ పరీక్షకు నిరుద్యోగులు భారీగా హాజరయ్యారు. నేటి నుండి ఈ నెల 23 వరకు వాలంటీర్లకు ముఖాముఖీలు జరగనున్నాయి. మొదటి రోజు 3 పంచాయతీల నుంచి 70 మంది హాజరయ్యారు. మొదట ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. అనంతరం ముఖాముఖీలు నిర్వహిస్తారు. మార్కాపురం మండలంలో మొత్తం 1,402 మంది దరఖాస్తు చేసుకున్నారు.