ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జీవితాల్ని మార్చిన కనకాంబరాలు! - కొండాపురం మహిళల సక్సెస్​ స్టోరీ

ఉన్న ఊరిని వదిలి బయటకు రావాల్సిన పరిస్థితి! పరాయి ఊళ్లో ఆదుకొనే వారెవరు? ఆదాయం ఎలా? అని ఆలోచిస్తున్న ఆ గ్రామాల మహిళలకు పూలే అండగా నిలబడ్డాయి. ఆదాయంతోపాటు ఆత్మవిశ్వాసాన్నీ ఇచ్చాయి. మూడు గ్రామాల మహిళల జీవితాల్లో కనకాంబరాలు తెచ్చిన మార్పు గురించి తెలుసుకుందాం రండి..

జీవితాల్ని మార్చిన కనకాంబరాలు!
జీవితాల్ని మార్చిన కనకాంబరాలు!

By

Published : Jul 28, 2022, 9:21 AM IST

వైఎస్సార్‌ జిల్లా.. కొండాపురం మండలంలోని గండికోట ప్రాజెక్టు పరిధిలో 32 గ్రామాల ప్రజలు రెండేళ్ల కిందట పునరావాస కాలనీలకు మారారు. ప్రభుత్వం ఒక్కొక్కరికీ ఇచ్చిన ఐదు సెంట్ల భూమిలో రెండున్నర సెంట్లలో ఇళ్లు కట్టుకున్నారు. పరిసరాలు, ఇళ్లు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ గతంలోలా ఉపాధి లేదు. భూమిని నమ్ముకున్న రైతన్నలు సాగుకి, పశుపోషణకీ దూరమయ్యారు. దాంతో ఇల్లు గడవడం కష్టమయ్యింది. ఆ సమయంలో శివజ్యోతికి వచ్చిన ఆలోచన ఇప్పుడు మూడు గ్రామాల వారికి ఉపాధి చూపించింది. ‘మా భూములు గండికోట జలాశయం ముంపునకు గురయ్యాయి. దాంతో స్థిరమైన ఆదాయం లేదు. అప్పుడే నాకు పాత గ్రామంలో పెరడంతా పూసే కనకాంబరాలు గుర్తుకొచ్చాయి. వాటి అంట్లను తెచ్చి ఇంటి ముందున్న స్థలంలో వేశాను. చూస్తుండగానే పెద్ద తోట అయ్యింది. ఇప్పుడు రోజుకు మూడు, నాలుగు కేజీల పూలొస్తున్నాయి. ఉదయం, సాయంత్రం పూలు ఏరి.. తాడిపత్రి, ప్రొద్దుటూరు మార్కెట్‌లకు తీసుకెళ్తా. కిలోకు రూ.నాలుగు వందలొస్తాయి. సంవత్సరం మొత్తం వస్తాయి కానీ... జనవరి - ఏప్రిల్‌ మధ్య ఎక్కువగా పూస్తాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌లో మంచి డిమాండ్‌ ఉంటుంది’ అంటుంది శివజ్యోతి. అలా ఓబన్నపేటలో శివజ్యోతి చేసిన ఆలోచన... సీతాపురం, గండ్లూరు గ్రామాలకూ పాకింది. ఈ మధ్యనే చెవుటుపల్లిలోని మహిళలూ దీన్ని అందిపుచ్చుకున్నారు. ఈ గ్రామాల్లో కనకాంబరాల తోట లేని ఇల్లు ఉండదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ‘పశువులని పెంచేంత స్థలం లేదు. అలాగని ఖాళీగా ఉండలేం. దీంతో చిన్నగా పూల సాగు ప్రారంభించాం. ఇప్పుడు రోజువారీ ఖర్చులకు ఇబ్బంది లేదు. ఇంతకు ముందు పెట్టుబడి పెట్టి పంట ఎప్పుడు చేతికి అందుతుందాని ఎదురుచూసేవాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. ఏడాది పొడవునా మాకు కనకాంబరాలు ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. పెట్టుబడి పనీ పెద్దగా లేదు’ అని సంబరంగా చెప్పుకొచ్చింది ఓబన్నపేటకు చెందిన పల్లపోతుల భారతి. మనసుండాలేకానీ మార్గముంటుందని నిరూపించారీ మహిళలు.

ABOUT THE AUTHOR

...view details