గుంటూరు జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు..పేదవారికి సాయం చేయడమే లక్ష్యంగా పలు సేవా కార్యక్రమాలు(connect foundation services) నిర్వహిస్తున్నారు. యువత నడిపిస్తున్న వివిధ ట్రస్టుల వారంతా కలిసి కనెక్ట్ అనే ఫౌండేషన్‌గా ఏర్పడి ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం అందిస్తున్నారు. మురికివాడలను ఎంచుకుని అక్కడ వారికి కావాల్సిన దుస్తులు, పుస్తకాలు, ఆహార పదార్థాలు అందిస్తూ.. ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. 'వి ఆర్ విత్ యూ' ఛారిటబుల్ ట్రస్ట్, స్పర్శ, కల్పవృక్ష, యంగ్ జనరేషన్ వంటి స్వచ్ఛంద సంస్థల వారితో కలిసి రక్తదానం కార్యక్రమం నిర్వహించినట్లు కనెక్ట్ సభ్యులు చెప్పారు.
సమాజంలోని వివిధ రకాల సమస్యలపై కనెక్ట్ స్వచ్చంద సంస్థ(connect foundation at guntur) పనిచేస్తోందని ట్రస్టు సభ్యులు చెబుతున్నారు. విద్య, వైద్య వ్యవస్థ, విద్యార్థులకు ఉపకారవేతనాలు, చిన్నారులు, మహిళల సమస్యలు, పర్యావరణ పరిరక్షణ వంటి విషయాలపై అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా విపత్కర సమయంలో నిత్యావసరాలు, కొవిడ్ బాధితులకు కావాల్సిన సేవలు అందించారు. ఖాళీ సమయాల్లో యువత ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. సేవా కార్యక్రమాలు నిర్వహించటం ఆనందంగా ఉంటుందని.. పలువురికి స్ఫూర్తిదాయకంగా ఉంటున్నామని కనెక్ట్ ఫౌండేషన్ సభ్యులు చెబుతున్నారు.