కొత్త జిల్లాల ఏర్పాటు క్రమంలో భాగంగా నూతనంగా మరో రెండు డివిజన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి, శ్రీకాకుళం జిల్లాలోని రాజాంను రెవెన్యూ డివిజన్లుగా ప్రకటించేలా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 51 డివిజన్లుండగా ఇటీవల వాటిని 62 చేశారు. వీటికి అదనంగా సత్తెనపల్లి, రాజాంలను రెవెన్యూ డివిజన్లుగా చేయాలని ప్రభుత్వానికి అభ్యర్థనలు అందాయి. సత్తెనపల్లిపై ప్రజాప్రతినిధులు, రాజాం విషయంలో ఓ పారిశ్రామిక సంస్థ ద్వారా వచ్చిన వినతులను ఖరారు చేసే దిశగా ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది.
గుంటూరు జిల్లాలో నరసరావుపేట కేంద్రంగా ఏర్పడుతున్న పల్నాడు జిల్లాలో ప్రస్తుతం నరసరావుపేట, గురజాల కేంద్రంగా రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. సత్తెనపల్లి, పెదకూరపాడు కలిసి సత్తెనపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పడే అవకాశముంది. సత్తెనపల్లి, రాజుపాలెం, ముప్పాళ్ల, నకరికల్లు, పెదకూరపాడు, అమరావతి, క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండ మండలాలు దీని పధిలోకి వస్తాయి. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలోని రాజాం, రేగిడి వంగర, సంతకవిటి, చీపురుపల్లిలోని చీపురుపల్లి, గుర్ల, గరివిడి, మెరకముడిదాం, బొబ్బిలి నియోజకవర్గంలోని తెర్లాం కలిపి మొత్తం తొమ్మిది మండలాలతో రాజాంను డివిజన్ కేంద్రంగా ప్రకటించే అవకాశముంది.