ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే.. మండలి రద్దు చేసేస్తారా?' - టీడీపీ పార్లమెంటరీ సమావేశంపై కనకమేడల కామెంట్స్

తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన... పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళగిరి తెదేపా కార్యాలయంలో జరుగుతుంది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెదేపా ఎంపీ కనకమేడల తెలిపారు. సమావేశానికి ముందు కనకమేడల మీడియాతో మాట్లాడారు.

kanaka medala
ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌

By

Published : Jan 28, 2020, 1:45 PM IST

మండలి రద్దుపై తెదేపా ఎంపీ కనకమేడల వ్యాఖ్యలు
రాష్ట్రంలోని ప్రస్తుత పరిణామాలు, మండలి రద్దుపై తెదేపా పార్లమెంటరీ సమావేశంలో చర్చించనున్నట్లు ఆ పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. మంగళగిరి తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, ఆయన అభీష్టానికి అనుగుణంగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ, శాసన, న్యాయ వ్యవస్థలను అగౌరవపరుస్తున్నారన్నారు. వైకాపా తీరు ఇలానే ఉంటే రాష్ట్రంలో సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందన్నారు. మండలి రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజావ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధమైనవని విమర్శించారు.

19 బిల్లులు ఆమోదిస్తే..మాట్లాడలేదే..

రాజధానుల బిల్లులను సెలక్టు కమిటీకి పంపితే మండలి రద్దు చేయాలంటున్నారని కనకమేడల ఆరోపించారు. అంతకు ముందు 19 బిల్లులను ఎటువంటి అభ్యంతరం లేకుండా మండలి ఆమోదించిందని గుర్తు చేశారు. తన అధికారాలను వినియోగిస్తే... మండలిని రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. శాసన మండలి పునరుద్ధరణ సంబంధించి 2013లో... రాజ్యసభ ఓ సెలక్టు కమిటీ వేసి కొన్ని సూచనలు చేసిందని తెలిపారు.

వాటి తర్వాతే... ఏపీ అంశం చర్చకు

కొత్తగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలపై శాసనమండలి భవిష్యత్తు ఆధారపడకూడదని ఆ కమిటీ తెలిపిందన్నారు. అందుకోసం జాతీయస్థాయిలో ఓ నిర్ణయం తీసుకోవాలని సెలక్టు కమిటీ సూచించిందన్నారు. సెలక్టు కమిటీ సూచనలు, శాసనమండలి పునరుద్ధరణ చేయాలన్న నిర్ణయాలు కేంద్రం వద్ద ఇంకా పెండింగ్​లో ఉన్నాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా మండలి పునరుద్ధరణ అంశాలు కేంద్రం వద్ద పెండింగ్​లో ఉన్నాయన్నారు. ఏపీ మండలి రద్దు సైతం వాటి తర్వాతే కేంద్రం పరిశీలిస్తుంది కానీ... రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వదన్నారు. శాసనమండలి రద్దుపై పార్లమెంట్​లో జరిగే చర్చలో అన్ని అంశాలను లేవనెత్తుతామన్నారు. పార్లమెంట్​లో అనుసమరించాల్సిన వ్యూహాలపై ఇవాళ చర్చిస్తామని కనకమేడల తెలిపారు.

ఒక సీఎంకు అనుకూలంగా కేంద్రం వ్యవహరించదు

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకోదని కనకమేడల అన్నారు. అన్ని రాష్ట్రాల పరంగా ఉన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం నిర్ణయం ఉంటుందన్నారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థైన మండలిపై శాసనసభ ఓ తీర్మానం చేసి రద్దు చేయవచ్చా.. ఓ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే.. మండలి రద్దు చేస్తారా అని పార్లమెంట్ నిలదీస్తామన్నారు. కేవలం ఆఫీసులు మార్చినంత మాత్రాన వికేంద్రీకరణ అవ్వదని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రతిపాదన దేశంలో ఎక్కడా లేదన్న కనకమేడల.. రాజకీయకుట్రలో భాగంగానే 3 రాజధానులను ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

'రాజధానిగా అమరావతి సాధనే.. మా ఏకైక లక్ష్యం'

ABOUT THE AUTHOR

...view details