MLC Dokka సెప్టెంబర్ 2వ తేదీ తర్వాత తాడికొండ నియోజకవర్గంలో రాజకీయాలన్నీ సర్దుకుంటాయని ఎమ్మెల్సీ మాణిక్య వరప్రసాద్ అన్నారు. తాడికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీదేవి ఆధ్వర్యంలో తాను కూడా పని చేస్తానన్నారు. శ్రీదేవి తనకు చెల్లెలు వంటిదని, ఆమె తండ్రి, సోదరులు కూడా తనతో కలిసి పని చేశారని గుర్తు చేశారు. శ్రీదేవికి అన్యాయం జరిగే ప్రసక్తే లేదని, ఆమె రాజకీయ భవిష్యత్తు గురించి జగన్మోహన్ రెడ్డి చూసుకుంటారని తెలిపారు. తప్పుడు పనులు చేసే కొందరు... ఆమెను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఆమెను తీసుకుని ముఖ్యమంత్రిని కలుస్తానన్నారు. తన రాజకీయ గురువు రాయపాటిని ఎప్పటికీ గౌరవిస్తానని, ప్రస్తుతం తన బాస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన ఆదేశాలు పాటిస్తానని స్పష్టం చేశారు. పేరేచర్లలోని కైలాసగిరి శివాలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
"తాడికొండ విభేధాలు త్వరలోనే సర్దుకుంటాయి. ఎమ్మెల్యే శ్రీదేవి ఆధ్వర్యంలో నేనూ పనిచేస్తా. శ్రీదేవి మా కుటుంబ సభ్యురాలు, చెల్లెలు వంటిది. శ్రీదేవి తండ్రి, సోదరులు నాతో కలిసి రాజకీయాల్లో పనిచేశారు. శ్రీదేవికి ఎలాంటి అన్యాయం జరగదు. శ్రీదేవిని తీసుకుని ముఖ్యమంత్రిని కలుస్తా. నా రాజకీయ గురువు రాయపాటిని ఎప్పటికీ గౌరవిస్తా."-డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్సీ
Ycp tadikonda politics గుంటూరు జిల్లా తాడికొండ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం. ప్రస్తుతం ఇక్కడ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమిస్తున్నట్లు.. వైకాపా రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. సాధారణంగా పార్టీకి ఎమ్మెల్యే లేని చోట్ల ఇన్‌ఛార్జ్‌లు ఉంటారు. ఇక్కడ ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. అదనపు ఇన్‌ఛార్జ్‌ను నియమించడం.. రాజకీయంగా కాక రేపింది. డొక్కా నియామక ప్రకటన వెలువడగానే.. శ్రీదేవి విస్తుపోయారు. వైకాపా జిల్లా అధ్యక్షురాలు సుచరిత ఇంటి ఎదుట.. అనుచరులతో కలిసి ఆందోళన చేపట్టారు. కొందరు నాయకులతో ప్రెస్‌మీట్లు పెట్టించి.. రాజీనామాలు చేస్తామని ప్రకటింపజేశారు. అయినా అధిష్ఠానం నుంచి స్పందన రాలేదు. దీంతో శ్రీదేవి ఇంట్లోంచి బయటకు రావడం లేదు. గడపగడపకు కార్యక్రమాన్ని కూడా ఆపేశారు.