గుంటూరు జిల్లాలో కొవిడ్ 19 కేసులు 5 వేలు దాటగా.. అందులో రెండు వేల కేసులు ఒక్క గుంటూరులోనే నమోదయ్యాయి. గుంటూరు నగరంలో ఎక్కువ కేసులు నల్లచెర్వు ప్రాంతంలో నమోదయ్యాయి. ఇక్కడ 161 కేసులున్నాయి. అలాగే శ్రీనివాసరావుతోట, ఐపీడీ కాలనీ, సంగడిగుంట, సంపత్ నగర్, పాతగుంటూరు, బ్రాడీపేట, అరండల్ పేట, ఏటీ అగ్రహారం, కుమ్మరిబజార్, ఆర్టీసీ కాలనీ, గుంటూరు వారి తోట, లాలపేట ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
కంటైన్మెంట్ జోన్లలో ప్రత్యేకంగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. అక్కడ వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని ఉంచుతున్నారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. నగరంలో ఎక్కువ కేసులు నమోదవుతున్న దృష్ట్యా వ్యాధి నిర్ధరణ పరీక్షలు ముమ్మరం చేశారు. కంటైన్మెంట్ జోన్ల వద్దకే వైద్య సిబ్బంది ప్రత్యేక వాహనాల్లో వెళ్లి నమూనాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా ప్రైమరీ కాంటాక్ట్స్ కు పరీక్షలు చేసి వారికి వైరస్ వచ్చిందో లేదా నిర్ధరించటం ద్వారా కరోనా వ్యాప్తిని నివారిస్తున్నారు. యాంటిజెన్ కిట్ల ద్వారా ఈ ప్రక్రియ చేపడుతున్నారు. పరీక్ష చేయించుకున్న వారి వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. సర్వర్ నెమ్మదించడంతో ఈ ప్రక్రియ కొంచెం మందకొడిగా సాగుతోంది. ప్రైమరీ కాంటాక్ట్స్ అందరినీ వాలంటీర్ల ద్వారా సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి పిలిపించి అక్కడే ఈ పరీక్షలు చేసేలా చర్యలు చేపడుతున్నారు.
నగరంలో లాక్ డౌన్ ఆంక్షలు తీవ్రతరం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక నుంచి ఉదయం 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు, వాణిజ్య సముదాయాలు తెరవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే మాస్క్ తప్పనిసరిగా ఉండాలన్నారు. మాస్కులు ధరించకపోతే జరిమానాలు విధిస్తున్నారు. వాహనాలపై ఎక్కువమంది వెళ్లకుండా చర్యలు చేపట్టారు.