రాష్ట్రంలో గంటకు 411 మంది కరోనా బారిన పడుతుండగా... ఇద్దరు మరణిస్తున్నారు. ఈ ప్రమాదకర పరిస్థితుల్ని నియంత్రణలోకి తెచ్చేందుకు.. బహిరంగప్రదేశాల్లో ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్రీడాప్రాంగణాలు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూళ్లను మూసివేయాల్సిందిగా ఆదేశించింది. ప్రజారవాణా, సినిమాహాళ్లు.. 50 శాతం సామర్ధ్యంతో మాత్రమే పని చేయాలని స్పష్టం చేసింది. వివాహాది శుభకార్యాలు, ఎక్కువ మంది గుమికూడే అవకాశం ఉన్న అన్ని అంశాల్లోనూ... 50 మందికి మించి పాల్గొనకూడదని స్పష్టం చేసింది. అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరయ్యేలా అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ప్రతి సీటుకూ 5 అడుగుల సామాజిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా.. విజయవాడలో వ్యాపార సంస్థలన్నింటినీ మధ్యాహ్నం 2 గంటలకే మూసివేయాలని చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. విశాఖ నగరంలో విహార స్థలాలు, పార్కులన్నింటినీ మూసివేస్తూ జీవీఎంసీ, వీఎమ్ఆర్డీఏ ఆదేశాలిచ్చాయి. తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం మతపరమైన కార్యక్రమాలు, వాణిజ్య లావాదేవీలపై ఆంక్షలు విధించింది. మసీదుల్లో నాలుగో వంతు సంఖ్యలో మాత్రమే ప్రార్థనలకు అనుమతినిస్తూ ఆదేశాలిచ్చారు. ఆలయాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకే భక్తుల్ని అనుమతించాలని స్పష్టం చేశారు. చర్చిల్లోనూ మతపరమైన కార్యక్రమాలను పాస్టర్లు మాత్రమే నిర్వహించాలని తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో.. వ్యాపార కార్యకలాపాలు మధ్యాహ్నం రెండు గంటల వరకే నిర్వహించాలని ఆదేశించారు.