గుంటూరు జిల్లాలో కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు వేగవంతమైంది. ఇప్పటికే గుంటూరు, బాపట్ల, నరసరావుపేట కేంద్రాలుగా మూడు జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. నూతన కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భవనాలు, స్థలాలను పరిశీలించిన అధికారులు నివేదిక సిద్ధం చేశారు.
మరో డివిజన్...?
గుంటూరు జిల్లా పరిధిలో గుంటూరు, తెనాలి రెవెన్యూ డివిజన్లు ఉండగా... కొత్తగా మరో డివిజన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీని కోసం మంగళగిరి, తాడేపల్లి పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. నరసరావుపేట జిల్లా పరిధిలో ప్రస్తుతం నరసరావుపేట, గురజాల రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కొత్తగా సత్తెనపల్లిలో మరో డివిజన్ ఏర్పాటు చేయాలా? లేదా ఇతర ప్రాంతాలను పరిశీలించాలా? అన్న విషయమై చర్చ జరుగుతోంది. బాపట్ల జిల్లా పరిధిలో వేమూరు, రేపల్లె, బాపట్ల నియోజకవర్గాలను కలిపి బాపట్ల కేంద్రంగా ఓ డివిజన్ ఏర్పాటు చేయనున్నారు. అద్దంకి, సంతనూతలపాడు, పర్చూరు, చీరాల నియోజవర్గాల పరిధిలో మరో రెండు డివిజన్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వినిపిస్తోంది.