ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్.. రాష్ట్రంలోనూ ప్రభావం చూపుతోంది. ఆదివారం మరో ఏడుగురు వైరస్ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరారు. వీరితో కలిపి చికిత్స పొందుతున్న వారి సంఖ్య 28కి చేరింది. గుంటూరు ప్రభుత్వ జ్వరాల వైద్యశాల, మదనపల్లె ప్రభుత్వాసుపత్రుల్లో ఇద్దరేసి చొప్పున కరోనా అనుమానితులు చేరారు. ఇటీవలే వియత్నాం నుంచి వచ్చిన మహిళ.. గుంటూరు ఆసుపత్రిలో చేరారు. చిత్తూరు జిల్లా కురబలకోటకు చెందిన ఓ వ్యక్తి, మరో మహిళ జలుబు, దగ్గుతో మదనపల్లెకు వచ్చారు. వీరిద్దరు ఇటీవలే కువైట్ నుంచి స్వగ్రామానికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వారిని తిరుపతి రుయాకు పంపారు.
విశాఖకు చెందిన 25 ఏళ్ల వ్యక్తి నెలపాటు కోయంబత్తూరులో విదేశీయులతో కలిసి యోగా శిక్షణ పొందారు. 4 రోజుల కిందట స్వస్థలానికి వచ్చారు. దగ్గు, జ్వరంతో ఛాతీ ఆసుపత్రిలోని కరోనా వార్డును ఆశ్రయించారు. ఆయనతో కలిపి విశాఖలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఐదుకు చేరగా.. ముందు చేరిన నలుగురి ఆరోగ్యం మెరుగుపడిందని అధికారులు తెలిపారు. రష్యా నుంచి అనంతపురం వచ్చిన ఓ యువకుడు కరోనా అనుమానంతో సర్వజనాసుపత్రిలో చేరగా అతనికి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నమూనాలను హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి పంపగా.. ఫలితం రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 79 అనుమానితుల నమూనాలాను పరీక్షలకు పంపామని.. వాటిలో 65 మందికి వ్యాధి లేదని నిర్థరణ అయినట్లు అధికారులు చెప్పారు. మరో 13 నివేదికలు రావాల్సి ఉందని వెల్లడించారు.