Election Results: ‘పుర’ ఓట్ల కౌంటింగ్.. ఎక్కడెక్కడ ఏయే పార్టీలు గెలిచాయంటే..?
మిగిలిపోయిన మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికల్లో అధికార వైకాపా సత్తా చాటింది(Andhrapradesh municipal election results news). కీలకమైన కుప్పం, నెల్లూరు నగర పాలకను కైవసం చేసుకుంది(YSRCP wins in Kuppam news). రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల జరిగిన ఎన్నికల్లోనూ ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోగా.. కృష్ణా జిల్లా కొండపల్లి పురపాలికలో 14 స్థానాలను ఖాతాలో వేసుకుంది.
Election Results
By
Published : Nov 17, 2021, 3:51 PM IST
|
Updated : Nov 18, 2021, 3:26 AM IST
రాష్ట్రంలో మిగిలిపోయిన మున్సిపల్, నగర పంచాయతీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాయి(Andhrapradesh municipal election results news). ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో అధికార వైకాపా.. మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. కీలకమైన కుప్పం మున్సిపాలిటిలో ఫ్యాన్ పార్టీ పాగా వేసింది. రాజంపేట, గురజాల, దాచేపల్లి, కమలాపురం, ఆకివీడు, పెనుకొండ, బేతంచర్లలో వైకాపా విజయ దుందుభి మోగించింది. ప్రకాశం జిల్లా దర్శిలో మాత్రం.. తెదేపా ఖాతాలోకి చేరింది.
కుప్పంలో వైకాపా పాగా..
తెదేపా అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంను.. వైకాపా కైవసం చేసుకుంది(YSRCP wins in Kuppam news). కుప్పం పురపాలికలోని 25 వార్డులకుగాను.. 24 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 18 స్థానాల్లో ఫ్యాన్ పార్టీ విజయం సాధించింది. ఆరు వార్డుల్లో తెదేపా గెలిచింది. ఒక స్థానం గతంలోనే ఏకగ్రీవమైంది.
ఫ్యాన్ పార్టీ జోరు..
నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు, 4 పురపాలక సంఘాలు, 8 నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో వైకాపా హవా కొనసాగింది. ఇక్కడ గతంలోనే 8 డివిజన్లు వైకాపాకు ఏకగ్రీమయ్యాయి.
హోరాహోరీ..
కృష్ణా జిల్లాలోని కొండపల్లి పురపాలిక ఎన్నిక హోరాహోరీగా సాగింది. మొత్తం 29 వార్డుల్లో వైకాపా 14, తెదేపా 14 వార్డుల్లో విజయం సాధించింది. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి (తెదేపా రెబల్) గెలుపొందారు. అయితే గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి శ్రీలక్ష్మి.. చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. ఫలితంగా కొండపల్లిలో సైకిల్ పార్టీ బలం 15కి చేరింది.
గురజాల.. దాచేపల్లిలో ఇలా...
నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీని వైకాపా కైవసం చేసుకుంది. మొత్తం 20 స్థానాలకు గానూ వైకాపా - 18 , తెదేపా 2 వార్డుల్లో విజయం సాధించింది. ఇక గుంటూరు జిల్లాలోని గురజాల నగర పంచాయతీలో వైకాపా గెలిచింది. 20 వార్డులకు గానూ.. 16వైకాపా, 3 తెదేపా గెలవగా.. ఒక్క స్థానంలో జనసేన పాగా వేసింది. దాచేపల్లి నగర పంచాయతీని కూడా వైకాపా గెలుచుకుంది. 20 వార్డులకు ఎన్నికలు జరగగా.. 11 స్థానాల్లో వైకాపా, 7 వార్డుల్లో తెదేపా విజయం సాధించాయి. జసనేన 1, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో గెలిచారు.
ఆకివీడిలో వైకాపా
పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు నగర పంచాయతీని వైకాపా గెలుచుకుంది. 20 వార్డులకుగానూ వైకాపా 12, తెదేపా 4 వార్డుల్లో విజయం సాధించింది. జనసేన 3 స్థానాల్లో గెలవగా.. ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
దర్శిలో తెదేపా...
ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. 20 వార్డుల్లో 13 స్థానాల్లో సైకిల్ పార్టీ పాగా వేసింది. అధికార వైకాపా.. కేవలం 7 స్థానాల్లో గెలిచింది.
కడప జిల్లాలోని రాజంపేట పురపాలికను వైకాపా కైవసం చేసుకుంది. 29 వార్డుల్లో 24 వైకాపా, 4 తెదేపా ఒకచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇక కమలాపురం నగర పంచాయతీలోనూ ఫ్యాన్ పార్టీ.. గాలి వీచింది. 20 వార్డుల్లో 15 స్థానాలను వైకాపా.. 5 స్థానాల్లో తెదేపా గెలుచుకున్నాయి. కర్నూలు జిల్లా బేతంచర్ల నగర పంచాయతీని వైకాపా గెలుచుకుంది. ఇక్కడ ఉన్న 20 వార్డుల్లో వైకాపా-14, తెదేపా 6 వార్డుల్లో గెలిచాయి. అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీని అధికార వైకాపా కైవసం చేసుకుంది. 18 వార్డుల్లో వైకాపా, 2 వార్డుల్లో తెదేపా విజయం సాధించాయి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పురపాలిక 23వ వార్డులో తెదేపా అభ్యర్థి రమాదేవి విజయం సాధించారు. ఇక కాకినాడ నగర పాలక సంస్థలో ఎన్నికలు జరిగిన 4 డివిజన్లూ వైకాపా కైవసం చేసుకుంది. విశాఖ జీవీఎంసీ పరిధిలోని 31, 61 డివిజన్లలో ఫ్యాన్ పార్టీ పాగా వేసింది. విజయనగరం కార్పొరేషన్ ఒకటో డివిజన్‌లో కూడా అధికార పార్టీ గెలిచింది.
వైకాపా ఎమ్మెల్యే సొంత వార్డులో తెదేపా
కడప జిల్లా కమలాపురంలో వైకాపా ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సొంత వార్డైన.. ఆరో వార్డులో తెదేపా అభ్యర్థి షేక్ రెహానా గెలుపొందారు. ఇక్కడ 20 వార్డులకు వైకాపా 15, తెదేపా 5 గెలుచుకున్నాయి. తెదేపా అభ్యర్థులు ఒకటో వార్డులో 6, ఆరో వార్డులో 20, పన్నెండో వార్డులో 2, పదమూడో వార్డులో 7, 19వ వార్డులో 3 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. వైకాపా విజ్ఞప్తి మేరకు 1, 12, 19 వార్డుల్లో మూడేసి సార్లు రీకౌంటింగ్ చేసినా అదే ఫలితం వచ్చింది. తెదేపా తరపున గెలిచిన ఐదుగురిలో నలుగురూ ముస్లింలే.
కుప్పం ఎన్నికల్లో ఒక్క పోస్టల్ బ్యాలెట్ కూడా రాలేదు. రెస్కో ఛైర్మన్ సెంథిల్‌కుమార్ తమ్ముడు, 22వ వార్డు అభ్యర్థి అరుళ్‌పై తెదేపా అభ్యర్థి సురేష్ 233 ఓట్ల తేడాతో గెలుపొందారు. 11 వార్డులో తెదేపా అభ్యర్థి కస్తూరికి ఆరు ఓట్ల స్వల్ప ఆధిక్యం వచ్చింది. రీకౌంటింగ్ చేసినా ఫలితం మారలేదు. 21వ వార్డులో వైకాపా అభ్యర్థి లావణ్య ఏడు ఓట్ల తేడాతో గెలిచారు.
ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోని బేతంచర్ల నగర పంచాయతీకి తొలిసారి జరిగిన ఎన్నికల్లో తెదేపా గట్టి పోటీనిచ్చింది. వైకాపా 14 స్థానాలు గెలవగా, తెదేపా ఆరు చోట్ల గెలుపొందింది. 5, 7, 8, 19 వార్డుల్ని 100లోపు ఓట్ల తేడాతో తెదేపా కోల్పోయింది.
గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలో తెదేపా గట్టి పోటీనిచ్చింది. 20 వార్డులకు తెదేపా 7, జనసేన ఒకచోట గెలిచాయి. 11 వార్డుల్లో వైకాపా, ఒకచోట ఆ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి గెలిచారు.
రీకౌంటింగ్‌లో కొన్ని ఫలితాలు తారుమారు...
కొండపల్లిలో ఒకటో వార్డులో వైకాపా గెలవగా.. ఫలితాన్ని మార్చారని మాజీమంత్రి దేవినేని ఉమా ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు నిరసన తెలిపాయి. రీకౌంటింగ్‌కు పట్టుబట్టినా అధికారులు తిరస్కరించారు.
జగ్గయ్యపేటలో ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి ఎమ్మెల్యే ఉదయభాను ప్రవేశించడంపై తెదేపా అభ్యంతరం తెలిపింది.
జగ్గయ్యపేటలో 3 వార్డుల్లో పదిలోపు ఓట్ల ఆధిక్యంతో తెదేపా అభ్యర్థులు గెలుపొందారు. 13వ వార్డులో 6 ఓట్లతో తెదేపా గెలవగా, వైకాపా రీకౌంటింగ్ కోరింది. రెండు దఫాల లెక్కింపు తర్వాత.. వైకాపా 5 ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం 8వ వార్డులో తెదేపా ఒక్క ఓటుతో గెలిచిందనిచెప్పి తర్వాత వైకాపా విజయాన్ని ప్రకటించారు. రీకౌంటింగ్ తర్వాతా ఆ ఫలితాన్నే ఖరారు చేశారు.
పార్టీలకు అతీతంగా సీఎం జగన్ పాలన: మంత్రి పెద్దిరెడ్డి
ఫలితాల పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. కుల, మత, పార్టీలకు అతీతంగా సీఎం జగన్ పాలన కొనసాగుతోందన్నారు. దాని ఫలితంగానే కుప్పం మున్సిపాలిటీలో వైకాపాకు ఘన విజయం దక్కిందని వ్యాఖ్యానించారు.అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా జగన్ పాలన ఉండటంతోనే ఇది సాధ్యమైందన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెదేపా దౌర్జన్యకాండను అడ్డుకునేందుకే కుప్పం ప్రజలు వైకాపాను గెలిపించారన్నారు. కుప్పం నియోజకవర్గంలో సర్పంచ్, మండల పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో తెదేపాను ప్రజలు తిరస్కరించారన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తారని తాము అనుకోవట్లేదని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాక ఓట్ల కోసం డబ్బులు పంచాల్సిన అవసరం తమకు లేదన్నారు. దొంగ ఓట్లు వేశారంటున్న తెదేపా ఆరోపణలపై మంత్రి స్పందించారు. ఏ పోలింగ్ బూత్‌లో అయినా దొంగ ఓట్లు వేశారంటూ తెదేపా ఏజెంట్లు అడ్డుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు. తన సొంత నియోజకవర్గంలో తనపై చంద్రబాబు పోటీ చేస్తే ఆహ్వానిస్తానని పెద్దిరెడ్డి చెప్పారు.
మోసం చేసి గెలిచారు: అచ్చెన్నాయుడు
ఎన్నికల ఫలితాలపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. దాచేపల్లిలో అనేక ఇబ్బందులు పెట్టారని.. 2, 3 స్థానాల ఫలితాలు తారుమారు చేశారని ఆరోపించారు. జగ్గయ్యపేట కౌంటింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే ఎలా వెళ్తారని..? ప్రశ్నించారు. విశాఖలో మోసం చేసి గెలిచారని దుయ్యబట్టారు. కుప్పం గెలుపును ఎవరూ లెక్కలోకి తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, పోలీసులు, డబ్బు పంపిణీ వల్లే కుప్పంలో వైకాపా గెలిచిందన్నారు.
'ఈ 7 నెలల్లో తెదేపా ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. వైకాపా నేతలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి. ఆర్థికమంత్రి బుగ్గన సొంత ఇలాకా బేతంచర్లలో మాకే ఆధిక్యం. నామినేషన్లు వేయొద్దని అనేకచోట్ల భయపెట్టారు. సీఎం జగన్ కనుసన్నల్లోనే స్థానిక ఎన్నికలు జరిగాయి' - అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు