వైఎస్ఆర్ చేయూత రెండో విడతను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. కుల ధ్రువీకరణ పత్రాలు పొందలేక పోవడం, సాంకేతిక అంశాలు సహా పలు కారణాలతో లబ్ధిపొందని మహిళలకు రెండో విడత కింద ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం. తాడేపల్లిలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ రెండో విడత పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అర్హులైన 2 లక్షల 72 వేల మందికి రెండో విడత కింద ఒక్కొక్కరికీ రూ.18,500 చొప్పున రూ.510 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమచేశారు.
మహిళలకు ఉపాధి కల్పించడం, వృద్ధిలోకి రావాలని ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. లబ్ధిదారులకు ఒకేసారి రూ.75 వేలు వచ్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వం రూ.18,750 ఇస్తే మిగిలినవి బ్యాంకులు రుణంగా ఇస్తున్నాయన్నారు. 21 లక్షల 189 మందికి రూ.3937 కోట్ల రుణాలు వైఎస్ఆర్ చేయూత మొదటి విడత కింద సాయం చేశామని... ఇప్పటి వరకు 23.72 లక్షల మంది వైఎస్ఆర్ చేయూత కింద లబ్ది పొందారని... వీరిలో 27 వేల మంది దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారని వివరించారు.