Electricity Bill with Mobile Phone : మీ ఇంట్లో వాడిన కరెంటుకు మీరే బిల్లు తీసుకోవచ్చు.. వెంటనే ఆన్‌లైన్‌లో చెల్లించనూవచ్చు.. ఆ సౌకర్యం ఉందని తెలుసా? మీ సెల్‌ఫోన్‌తో మీ ఇంటి విద్యుత్ మీటరు రీడింగ్‌ను ఫొటో తీస్తే ఎన్ని యూనిట్లు వినియోగించారో తెలుస్తుంది. నెల పూర్తయితే బిల్లు కూడా వస్తుంది. నెలకోసారి బిల్లు కోసం మీటర్ రీడింగ్ ఫొటో తీసుకోవడమే కాక, ఏ రోజైనా మీటరును ఫొటో తీస్తే అప్పటివరకూ ఆ నెలలో ఎన్నిరోజులకు ఎన్ని యూనిట్లు కరెంటు వాడారు, నెల పూర్తవడానికి ఇంకా ఎన్ని రోజులుంది, అప్పటివరకూ మీ బిల్లు ఎంత రావచ్చనేది ఏరోజైనా తెలుసుకోవచ్చు.
ఈ సౌకర్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు కసరత్తు చేస్తున్నాయి. తొలుత హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలో కరోనా లాక్‌డౌన్ సమయంలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఇప్పటివరకూ 10లక్షల మంది ఇలా సెల్‌ఫోన్ కెమెరాతో వారి ఇంట్లో కరెంటు మీటర్ రీడింగ్‌ను ఫొటో తీసి బిల్లు చెల్లించారు. నేటికీ చాలామందికి దీనిపై పూర్తిగా అవగాహన లేనట్లు చెప్పారు. గత జనవరిలో నాంపల్లి ఎగ్జిబిషన్‌లో ఈ విధానంపై అవగాహన కల్పించడానికి స్టాల్ ఏర్పాటుచేస్తే వేలమంది ఆసక్తి చూపారు.
యాప్ నిక్షిప్తం ఇలా..స్మార్ట్‌ఫోన్‌లో ‘గూగుల్ ప్లే స్టోర్’లోకి వెళ్లి తొలుత మీరు ఏ డిస్కం పరిధిలో ఉంటే దాని యాప్‌ను డౌన్‌లోడు చేసుకోవాలి. రాష్ట్రంలో ఉత్తర తెలంగాణకు ‘టి.ఎస్.ఎన్.పి.డి.సి.ఎల్, దక్షిణ తెలంగాణకు టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్’ అనే డిస్కంల యాప్‌లున్నాయి. వీటిలో ఏదో ఒక ప్రాంతంలో మీ ఇంటి లేదా దుకాణం, పరిశ్రమ కరెంటు కనెక్షన్ ఉంటుంది. డిస్కం యాప్ డౌన్‌లోడ్ అయ్యాక, మళ్లీ గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ‘భారత్ స్మార్ట్ సర్వీసెస్’ అనే యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌ను ఓపెన్ చేసి ‘సెల్ఫ్ బిల్లింగ్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో రాష్ట్రం అనేచోట తెలంగాణ, డిస్కం అనే చోట మీ కనెక్షన్ ఉన్న టి.ఎస్.ఎన్.పి.డి.సి.ఎల్. లేదా టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్.’ ఎంపిక చేసుకోవాలి.