నామినేషన్ల చివరి రోజు అధికార వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తెదేపా అభ్యర్థుల నామినేషన్ల పత్రాలను చించేసి వీరంగం సృష్టించారు. తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, బొండా ఉమా ప్రయాణిస్తున్న కారుపై కర్రలతో దాడి చేసి...అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసుల పర్యవేక్షణలో ఉన్నప్పటికీ...మార్గమధ్యమంలో దాడికి ప్రయత్నించారు. నెల్లూరు జిల్లాలో భాజపా కార్యకర్త చేయిని నరకడమే కాకుండా... ఆ కార్యకర్త అల్లుడిని తీవ్రంగా గాయపరిచి అరాచకం సృష్టించారు.
బుద్ధా, ఉమాపై దాడి...
గుంటూరు జిల్లా మాచర్లలో వైకాపా నాయకులు రెచ్చిపోయారు. తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్న, బొండా ఉమా వెళ్తున్న వాహనంపై దాడికి తెగబడ్డారు. కారును వెంబడించిన.. మాచర్ల - దుర్గి మార్గంలో దొరకబుచ్చుకుని దాడి చేశారు. దాడిలో బుద్ధా వెంకన్న, బొండా ఉమ సహా.. వాహనంలో ఉన్న న్యాయవాది కిశోర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆలస్యం చేస్తే ప్రాణాలకే ముప్పని గ్రహించిన డ్రైవర్... కారును వేగంగా ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత వైకాపా వర్గీయులు మరోసారి దాడికి ప్రయత్నించారు. మార్గం మధ్యలో తెలుగుదేశం నేతలు గురజాల డీఎస్పీ, వెల్దుర్తి సీఐకి ఫిర్యాదు చేస్తుండగా... వైకాపా నాయకులు మరోసారి దాడికి యత్నించారు. పోలీసుల సాయంతో తప్పించుకుని దుర్గి వైపు వెళ్లారు. పోలీసుల వాహనంపైనా రాళ్లు రువ్వుతూ భయానక వాతావరణం సృష్టించారు.
నామపత్రాల చించివేత..అక్రమ కేసులు
ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం విపక్షాల నామినేషన్లును అడ్డుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. చిత్తూరు జిల్లా పుదిపట్లలో తెలుగుదేశం ఎంపీటీసీ అభ్యర్థి నామపత్రాలను చించివేశారు. కడప, గుంటూరు, నెల్లూరు, జిల్లాల్లోనూ... అక్రమ కేసుల పర్వం కొనసాగుతోంది. పుంగనూరులో తెదేపా అభ్యర్థి నామినేషన్ పత్రాలు, కుమరనత్తంలో జనసేన ఎంపీటీసీ అభ్యర్థి పత్రాలను చించేశారు.
చేయి నరికిన వైకాపా కార్యకర్తలు
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంటపాలెంలో భాజపా ఎంపీటీసీ అభ్యర్థి మణెమ్మ నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా వైకాపా నాయకులు అడ్డుకున్నారు. అభ్యర్థి మణెమ్మ చెయ్యి, భుజంపై నరికి... ఆమె అల్లుడిని తీవ్రంగా గాయపరిచారు.