Road accident in Ramanthapur: ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులను పాల లారీ ఢీ కొట్టిన ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు గాయాలయ్యాయి. తెలంగాణ హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధి రామాంతపూర్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళానికి చెందిన దంపతులు పున్నగిరి, కమల బతుకుదెరువు కోసం రామంతాపూర్‌కు వచ్చి నివాసం ఉంటున్నారు. ఉదయం పని నిమిత్తం భార్యభర్తలు చర్లపల్లికి ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బయలుదేరారు.
ఐదు నిమిషాల్లో వరంగల్ జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. ఇంతలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన పాల వాహనం వీరిని ఢీకొట్టింది. దీంతో వెనుక కూర్చున్న భార్య కింద పడిపోవడంతో తలపై నుంచి లారీ చక్రాలు వెళ్లాయి. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. భర్తకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటి వరకు తనతో ఉన్న భార్య కళ్లముందే మరణించడంతో భర్త కన్నీరుమున్నీరుగా విలపించారు.