మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ తుది దశకు చేరుకుంది. హత్య వెనుక ఐదుగురు రాజకీయ పెద్దల జోక్యం ఉందని వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె ఎన్.సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి తరఫున న్యాయవాది వీరారెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ... మరో పిటిషన్ దాఖలు చేసిన మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి తరఫున న్యాయవాది ఆర్.బసంత్ వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణ సక్రమంగా జరగడం లేదని వివరించారు.
ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కోసం హైకోర్టును ఆశ్రయించిన జగన్‌మోహన్ రెడ్డి... ముఖ్యమంత్రి అయ్యాక తన వ్యాజ్యంలో ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని చెబుతున్నారని న్యాయవాది ఆర్.బసంత్ కోర్టుకు తెలిపారు. పాలనా యంత్రాంగం అంతా సీఎం చేతుల్లో ఉన్నందున.. హత్య కేసును తారుమారు చేయొచ్చని ఆరోపించారు. వివేకా హత్య వెనుక బలవంతుడైన దగ్గరి బంధువు పాత్ర ఉందంటూ మృతుని కుటుంబసభ్యులు చెబుతున్న దానికి ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రిపై పిటిషనర్లు లేవనెత్తిన ఆరోపణలపై వాదనలు వినిపించేందుకు హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.