కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకాలు ఒక్కటే సరైన ప్రత్యామ్నాయమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. వ్యాక్సిన్‌లపై ప్రజల్లో ఉన్న అపోహలు, ఆందోళనలను పరిష్కరించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కరోనా సోకినా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయన్న నిపుణుల సూచనలు, పలు అధ్యయనాల నివేదికలను ఆయన ప్రస్తావించారు. తెలంగాణ రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత టీకా శిబిరాన్ని వెంకయ్య ప్రారంభించారు.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, నెల్లూరులలోని స్వర్ణభారత్ ట్రస్ట్ కేంద్రాల్లో ఏకకాలంలో ఈ కార్యక్రమం ప్రారంభమైందని వెంకయ్యనాయుడు తెలిపారు. మూడు ప్రాంగణాల్లో కలిపి దాదాపు 5 వేల మందికి టీకాలు వేశారని వివరించారు. ఆగస్టు నెలలో 50 శాతం మంది భారతీయులకు టీకాలు వేయడం పూర్తవడం సంపూర్ణ టీకా కార్యక్రమంలో భాగంగా భారతదేశం సాధించిన విజయాల్లో ఒకటని పేర్కొన్న ఆయన.. టీకాల తయారీ, ఉచితంగా ప్రజలకు టీకాలు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వాలు విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాయన్నారు. కరోనాపై పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తున్నాయన్న ఆయన.. అందరూ కలిసి ముందుకు సాగితేనే సత్ఫలితాలను సాధించగలమని స్పష్టం చేశారు.