సంగం డెయిరీని స్వాధీనం చేసుకుని అమూల్‌కు అప్పగించినట్లు భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్లను స్వాధీనం చేసుకునేందుకు జగన్ రెడ్డి.. ఏసీబీ, సీఐడీలను పంపగలరా అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు నిలదీశారు. "మన ఏసీబీ, సీఐడీలు... కృష్ణ ఎల్లా, పూనావాలాను ఎత్తుకు రాలేరా..? ఉత్తరం రాసినా వాక్సిన్లు ఇవ్వడం లేదని కర్నూలు, కడప స్టేషన్లలో కేసులు పెట్టించి పట్టుకురావచ్చు కదా? వాళ్లను వ్యాక్సిన్లు అడుక్కోకుండా సీఐడీ ఆఫీసులో రోజుకు తొమ్మిది గంటలు కూర్చోబెడితే మొత్తం కంపెనీ రాసిచ్చి పోరా?" అని ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు.
కేంద్రం పంపిన వ్యాక్సిన్లను జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించారని మరో ట్వీట్లో అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ప్రజల నుంచి వ్యతిరేకత రాగా... కోవాగ్జిన్ చంద్రబాబు బంధువులది కాబట్టే ఇవ్వట్లేదంటూ విమర్శలు మొదలపెట్టారని దుయ్యబట్టారు. "కేంద్రం పంపిన వ్యాక్సిన్లను ఎక్కువ వృథా చేస్తున్న రాష్ట్రాల‌్లో ఏపీ మొదటి స్థానంలో ఉన్నందుకే వ్యాక్సిన్ల సరఫరాపై కేంద్రం ఆంక్షలు పెట్టిందని జాతీయ మీడియా వెల్లడించింది. వ్యాక్సిన్ వృథా చేయకుండా కేంద్రం కళ్లుగప్పి వైకాపా ఎమ్మెల్యేలు, నేతలకు పక్కదారి పట్టించారని వెల్లడైంది. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అత్యవసరమైన వ్యాక్సిన్లు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తెప్పించుకుంటే, జగన్‌రెడ్డి మాత్రం చంద్రబాబు, తెదేపా నేతలపై తప్పుడు కేసులు పెట్టే పనిలో ఉన్నారు." అని మండిపడ్డారు.
సీఎం మానసిక స్థితిపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలి: ఎన్.బి.సుధాకర్ రెడ్డి