తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన తుంగభద్ర పుష్కారాలు ముగిశాయి. చివరి రోజు తుంగభద్ర నదికి మహహారతి ఇచ్చి వాయనం సమర్పించడంతో ఉత్సవాలు ముగించారు. నవంబర్ 20న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ పుష్కరాలను ప్రారంభించారు. అలంపూర్, పుల్లూరు, రాజోళి, వేణిసోంపురంలో ఘాట్లను ఏర్పాటు చేశారు. మొత్తం 4 లక్షల 10వేల మంది పుష్కర స్నానాలు ఆచరించారు. అత్యధికంగా అలంపూర్‌లో 2 లక్షల మంది, రాజోళిలో లక్ష, పుల్లూరు ఘాట్‌లో 79 వేల మంది, వేణి సోంపూర్‌లో 33 వేల మంది పుష్కర స్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు.
సకల ఏర్పాట్లు..
పుష్కరాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే.... నదీ స్నానానికి అనుమతిచ్చింది. ఆంధ్రప్రదేశ్ సహా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చివరి రోజున నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కుటుంబ సభ్యులతో కలిసి అలంపూర్ ఘాట్‌లో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు.