TS RTC Charges Hike:తెలంగాణ ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఛార్జీలు పెంచక తప్పడంలేదని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. పల్లె వెలుగు బస్సులకు కి.మీకు రూ.25 పైసలు, మిగతా సర్వీసులకు కి.మీకు రూ.30 పైసల చొప్పున పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని మంత్రి తెలిపారు.
ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌లతో సమీక్ష నిర్వహించారు. బస్సు ఛార్జీలు పెరిగితే ఇప్పుడున్న నష్టాలు కొంతమేరకైనా తగ్గే అవకాశాలున్నాయన్నారు. గడిచిన మూడేళ్లలో ఆర్టీసీ ఆదాయానికి, ఖర్చుకు మధ్య అంతరం భారీగా పెరిగిపోయిందని తెలిపారు. ఈ మూడేళ్లలో ఆర్టీసీకీ రూ.4,260 కోట్ల నష్టాలు వచ్చాయని మంత్రి వివరించారు. పెరుగుతున్న నష్టాలను తగ్గించుకోవాలంటే టిక్కెట్ ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని ఆర్టీసీ యాజమాన్యం అభిప్రాయపడుతుందని తెలిపారు.
ఆర్టీసీకి 2018-19 మార్చి నాటికి.. ఆదాయం రూ.4,882 కోట్లు కాగా, ఖర్చు రూ.5,811 కోట్లకు చేరిందన్నారు. ఫలితంగా రూ.929 కోట్లు నష్టం వచ్చిందని మంత్రి అజయ్ పేర్కొన్నారు. అదేవిధంగా 2019-20 మార్చి నాటికి ఆదాయం రూ.4,592 కోట్లు, ఖర్చు 5,594 కోట్లు అయిందన్నారు. ఫలితంగా నష్టం రూ.1,002 కోట్లు వచ్చిందన్నారు. 2020-21 మార్చి నాటికి ఆదాయం 2,455 కోట్లు, ఖర్చు రూ.4,784 కోట్లకు చేరుకుందని.. ఫలితంగా రూ.2,329 కోట్లు మేర నష్టం వాటిల్లిందని మంత్రి చెప్పారు. ప్రస్తుత ప్రతిపాదనల మేరకు ఛార్జీలు పెరిగితే ఆర్టీసీకి ఏడాదికి రూ.850 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందన్నారు.
ఆదాయం | వ్యయం | నష్టం | |
2018-19 | రూ.4,882 కోట్లు | రూ.5,811 కోట్లు | రూ.929 కోట్లు |
2019-20 | రూ.4,592 కోట్లు | రూ.5,594 కోట్లు | రూ.1,002 కోట్లు |
2020-21 | రూ.2,455 కోట్లు | రూ.4,784 కోట్లు | రూ.2,329 కోట్లు |