కరోనా పరిస్థితులతో స్తంభించిన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. పాఠశాల, ఇంటర్, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖల ఉన్నతాధికారులతో ఆ రాష్ట్ర మంత్రి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
ఈనెల 20 నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డిజిటల్ తరగతులు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. ముందుగా ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు దూరదర్శన్ యాదగిరి, టీ శాట్ ఛానల్ ద్వారా డిజిటల్ పాఠాలను ప్రసారం చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
కరోనా పరిస్థితులు కొంచెం మెరుగుపడినా.. ప్రాథమిక పాఠశాలలు ఇప్పట్లో ప్రారంభించే పరిస్థితి ఉండక పోవచ్చునని తెలంగాణ విద్యాశాఖ భావిస్తోంది. 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకూ సెప్టెంబర్ 1 నుంచి డిజిటల్ పాఠాలు బోధించాలని నిర్ణయించింది. ఈనెల 17 నుంచి సగం పాఠశాలలకు సగం మంది ఉపాధ్యాయులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల ఆన్లైన్ తరగతుల నిర్వహణకు నిర్దిష్ట సమయం, ఇతర విధి విధానాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
ఇంటర్మీడియట్ ప్రవేశాలపై..
ఈనెల 17 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్లైన్, డిజిటల్ పాఠాలు బోధించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. టీవీలు, యూట్యూబ్ ఛానల్ ద్వారా తరగతులు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ ఒకటి తరువాత ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.