ఏడున్నరేళ్లలో అనేక ఎన్నికల్లో విజయాలతో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్ర సమితికి.. దుబ్బాక ఉపఎన్నిక తర్వాత మరో ఎదురు దెబ్బతగిలింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజురాబాద్ ఉపఎన్నికలో ఓటమి.. గులాబీ పార్టీని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈటల రాజేందర్‌ను ఓడించి హుజూరాబాద్‌లో మరోసారి గులాబీ జెండా ఎగరవేసేందుకు తెరాస... అనేక వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకెళ్లింది. అవినీతి ఆరోపణలతో ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన వెంటనే ఎన్నికలకు సిద్ధమైంది. ఈటల రాజేందర్ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని.. పార్టీకి, కేసీఆర్‌కు నమ్మక ద్రోహం చేసేందుకు కుట్ర పన్నారని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఉపఎన్నికను ముందు నుంచీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెరాస.. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలందరినీ హుజూరాబాద్‌లో మోహరించింది.
దళితబంధుతో ముందుకొచ్చినా..
ఎప్పటిలాగే అభివృద్ధి, సంక్షేమం మంత్రాన్ని పటిస్తూనే.. బ్రహ్మాస్త్రంగా దళితబంధుతో ముందుకొచ్చినప్పటికీ... ఆశించిన ఫలితం దక్కలేదు. కొన్ని రోజులుగా కేటీఆర్ మాత్రం.. హుజూరాబాద్ ఉపఎన్నిక చాలా చిన్నదని.. అంతగా ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానిస్తూ వచ్చారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఏ ఎన్నిక ఫలితాల రోజయినా... సంబురాలతో సందడిగా ఉండే తెలంగాణ భవన్ బోసిపోయి కనిపించింది.
ఎందుకు గెలవలేదు...
హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాల సరళిని తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. హరీశ్‌రావుతో పాటు ముఖ్య నేతలతో చర్చించారు. పార్టీ ఓటమిపై త్వరలో కేసీఆర్ పూర్తిస్థాయిలో సమీక్షించనున్నారు. గతంలో దుబ్బాక ఉపఎన్నికల్లోనూ ఓడిపోయినప్పటికీ.. కొంత ఏమరుపాటు, అతివిశ్వాసమే ప్రధానంగా కొంప ముంచిందన్న అంచనాకు వచ్చారు. కానీ హుజూరాబాద్‌లో ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ప్రతీ విషయాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని ఎత్తులు, పైఎత్తులు వేసినప్పటికీ... ఎందుకు విజయం సాధించలేకపోయామన్న అంతర్మథనం మొదలైంది.
'తెరాసకు ఓట్లు తగ్గలేదే'