అమరావతిలో రాజధాని రైతుల పోరు 29 వ రోజుకు చేరింది. పండుగ రోజునా అమరావతి కోసం పోరు కొనసాగించాలని రైతులు నిర్ణయించారు. పోరాటమే పండుగ నినాదంతో ఇవాళ ఆయా ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టనున్నారు. రైతులకు మద్దతుగా సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉన్న నారా, నందమూరి కుటుంబసభ్యులు... నేడు రాజధానిలో పర్యటించనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో పాటు లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి , నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర ఆందోళనలు చేస్తున్న రైతుల వద్దకు వచ్చి సంఘీభావం తెలపనున్నారు.
ఇవాళ కూడా నిరసన కార్యక్రమాలు
మందడం, తుళ్లూరుల్లోనూ నేడు మహాధర్నాలు నిర్వహించనుండగా వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలేనిరాహారదీక్షలు కొనసాగనున్నాయి. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్ధండరాయునిపాలెంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు పూజలు నిర్వహించి... నిరసనలు తెలపనున్నారు. పోలీసులు అడ్డుకుంటే ఇళ్లు, ఆలయాల వద్దే నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు ఇతర గ్రామాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లోనూ ప్రజాసంఘాలు, రాజకీయపక్షాలు రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ ఆందోళనలు చేపట్టనున్నాయి.
పండగ పూటా పోరుబాటే.. ఇవాళ రైతుల ఉపవాస దీక్ష
రాజధాని గ్రామ ప్రజలు... సంక్రాంతి పండుగను ఉపవాస దీక్షలతో నిరసన తెలపనున్నారు. నిన్న భోగి మంటల్లో... మూడు రాజధానులకు సంబంధించిన కమిటీ నివేదికలను తగలబెట్టగా...ఇవాళ సంక్రాంతి పండుగకు దూరంగా ఆందోళనతోనే గడపనున్నారు. రైతులకు సంఘీభావంగా ఇవాళ నారా, నందమూరి కుటుంబసభ్యులు రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు.
today nara family visit in amaravthi area
ఇదీ చదవండి : రాజధాని తరలిస్తున్నామని మేం చెప్పలేదు: హోం మంత్రి
Last Updated : Jan 15, 2020, 7:31 AM IST