తెలంగాణలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బాధితుల సంఖ్య 41కి చేరింది. 43 ఏళ్ల మహిళతోపాటు, మూడేళ్ల చిన్నారిలో కరోనా లక్షణాలున్నట్లు... రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక బులిటెన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని 43 ఏళ్ల మహిళ... విదేశాలకు వెళ్లిన దాఖలాలు లేకపోయినా... ఇటీవల ఆమె కుటుంబసభ్యుల్లో లండన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. కుటుంబ సభ్యుల ద్వారా మహిళకు వైరస్ సోకగా... రాష్ట్రంలో కాంటాక్ట్ కేసుల సంఖ్య 6కి చేరుకుందని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
మూడేళ్ల చిన్నారికి..
ఇదే సమయంలో... తొలిసారి మూడేళ్ల చిన్నారిలోనూ.. కరోనా మహమ్మారి వెలుగుచూసింది. భాగ్యనగరానికి చెందిన 3 ఏళ్ల బాలుడు ఇటీవలే సౌదీ నుంచి వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. బాలుడి వివరాలను గోప్యంగా ఉంచిన అధికారులు... కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో నలుగురు 60 ఏళ్ల పైబడిన వారు కాగా... ఒక్క యువతికి 18 ఏళ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 813 మంది... కరోనా కాంటాక్ట్ లక్షణాలతో వైద్యుల సంరక్షణలో ఉన్నారు.
కట్టుదిట్టమైన చర్యలు..