ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆన్​లైన్​ బోధన.. ఆగస్టు 3 నుంచి మే రెండో వారం వరకు విద్యాసంవత్సరం - ఆన్​లైన్ విద్యా బోధన తాజా వార్తలు

ఈ విద్యాసంవత్సరానికి ఆన్‌లైన్‌ తరగతులే స్వాగతం పలకనున్నాయి. కరోనా కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు సాధారణానికి వచ్చేదాకా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాకే... నేరుగా బోధన చేపట్టే దిశగా పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక అకడమిక్‌ కేలండర్‌ను రూపొందిస్తోంది. పాఠ్యాంశాలను 30% తగ్గించేందుకు కసరత్తు జరుగుతోంది.

eenadu_online
eenadu_online

By

Published : Jul 2, 2020, 3:10 AM IST

కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా.... ఏర్పడ్డ పరిస్థితులు కుదుటపడేవరకూ ఈ ఏడాది ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఈ మేరకు ఆగస్టు 3 నుంచి మే రెండో వారం వరకూ విద్యాసంవత్సరం ఉండేలా కసరత్తు చేస్తున్నారు. దీంతో మొత్తం 180 పనిదినాలు ఉండనున్నాయి. సుమారు 30శాతం పాఠ్యాంశాల తగ్గింపునకు నిర్ణయించటంతో.... పనిదినాలు తగ్గినా విద్యార్థులపై ఒత్తిడి ఉండదని భావిస్తున్నారు. ఈ ఏడాది పండగ సెలవులూ తగ్గించనున్నారు. పరీక్షల షెడ్యూలూ మారనుంది.

పాఠశాలలు పనిచేసే 180 రోజుల్లో సాధారణ పరిస్థితులు వచ్చేదాకా... ఆన్‌లైన్‌, దూరదర్శన్‌, మన టీవీ ద్వారా పాఠాలు ప్రసారం చేయనున్నారు. ఆ తర్వాతే నేరుగా తరగతులు ఉండనున్నాయి. ఇప్పటికే 6 గంటల పాటు సప్తగిరి ఛానల్‌ ద్వారా 1 నుంచి 5 తరగతులకు బ్రిడ్జి కోర్సు.. 6 నుంచి 10 విద్యార్థులకు పాఠాలు చెబుతున్న విధానాన్ని కొనసాగించనున్నారు. దీనికి అదనంగా మన టీవీ ద్వారానూ పాఠాలు ప్రసారం చేయాలని భావిస్తున్నారు. మార్చి‌లో నిర్వహించే పదో తరగతి పరీక్షలను ఏప్రిల్‌కు మార్పు చేయడం.. మే మొదటి వారంలో 6 నుంచి 9 తరగతుల వారికి పరీక్షలు నిర్వహించేలా కేలండర్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. 2021 మే రెండోవారం నుంచి జూన్‌ 12 వరకూ సెలవులిచ్చి తర్వాత ఎలాంటి మార్పుల్లేకుండా వచ్చే విద్యాసంవత్సరాన్ని ప్రారంభించే దిశగా కసరత్తు చేస్తున్నారు.

మరోవైపు.... అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో తొలి సెమిస్టర్‌ వరకూ ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. మొదటి, మూడు, ఐదో సెమిస్టర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. దీనికోసం ప్రత్యేకంగా అభ్యాసన నిర్వహణ విధానం(ఎల్​ఎంఎస్​)ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇదీ చదవండి: పిటిషన్లపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ..ఉత్తర్వులు జారీ

ABOUT THE AUTHOR

...view details