ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 5, 2021, 6:54 PM IST

ETV Bharat / city

Third wave: హైరిస్క్ గ్రూప్​లో చిన్న పిల్లలు..?

మూడో వేవ్​లో చిన్న పిల్లలే హైరిస్క్ గ్రూప్​లో ఉంటారని వేర్వేరు నివేదికలు చెబుతున్నాయని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, ఐసీయూ ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించింది. మొదటి, రెండో వేవ్​లో చిన్నపిల్లలు ఏమేరకు ప్రభావితులయ్యారే దాన్ని బట్టే ధర్డ్ వేవ్​పై అంచనా వేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గుతున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది.

అనిల్ కుమార్ సింఘాల్
అనిల్ కుమార్ సింఘాల్

కరోనా ధర్డ్ వేవ్​లో పిల్లలకు కరోనా వైరస్ సంక్రమించే అంశంపై ఏర్పాటు చేసిన టాస్క్​ఫోర్స్ కమిటీ నివేదిక ఇచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. ధర్డ్ వేవ్ ఎప్పుడు వచ్చినా వైరస్ మ్యూటేషన్ల కారణంగా పిల్లలు హైరిస్క్ గ్రూప్​లో ఉంటారని వేర్వేరు అధ్యయనాలు చెబుతున్నాయని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన వ్యక్తులకు.. అలాగే 18 ఏళ్లు నిండిన వారికి కూడా ఆ సమయానికల్లా కనీసం ఒక్క డోసైనా వ్యాక్సినేషన్ పూర్తి అవుతుందని వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు.

ఈ కారణంగానే చిన్నారులు హైరిస్కు గ్రూప్​లో ఉంటారనే అంచనాలు వచ్చినట్టు వెల్లడించారు. మొదటి, రెండో వేవ్​లో ఎంతమంది చిన్నపిల్లలకు వైరస్ సోకిందనే దాన్ని బట్టే మూడో వేవ్​లో వారు ఎక్కువ ప్రభావితం అవుతారని అంచనా వేస్తున్నామన్నారు. అందుకు అనుగుణంగానే పడకలు, ఆక్సిజన్, ఐసీయూ యూనిట్లు కావాల్సి ఉంటుందని వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలియజేసింది.

క్రమంగా తగ్గుతోంది..

రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడి వయసున్న 50 శాతం మందికి కనీసం ఒక్క డోస్ అయినా కరోనా వ్యాక్సిన్ ఇచ్చామని వైద్యారోగ్యశాఖ తెలియజేసింది. జూన్ 5వ తేదీతో కోటీ 6 లక్షల 47 వేల మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయ్యిందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొవిడ్ క్రమంగా తగ్గుతోందని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో 406 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగం జరిగిందని స్పష్టం చేసింది.

డాక్టర్​ భాస్కర్​ వైద్యానికి రూ.కోటి

ప్రస్తుతానికి 1460 మ్యూకర్ మైకోసిస్ కేసులు రాష్ట్రంలో నమోదు అయ్యాయని వెల్లడించింది. మరోవైపు ప్రకాశం జిల్లా కారంచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు భాస్కర్ చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కోటి రూపాయల మొత్తాన్ని సీఎం మంజూరు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. కొవిడ్ విధుల్లో ఉన్న ఆరోగ్య సిబ్బంది అంతా ప్రమాదకరమైన పరిస్థితుల్లోనే పని చేస్తున్నారని స్పష్టం చేసింది.

2020 సెప్టెంబరు నుంచే..

సీనియర్ రెసిడెంట్ వైద్యులకు పెంచిన స్టైఫండ్​ను 2020 సెప్టెంబరు నుంచే అమలు చేయాలని సీఎం ఆదేశించినట్టు వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. ఆఖరి సంవత్సరం పీజీ విద్యార్థులకు మే నెల నుంచి స్టైఫండ్ పెంపు వర్తిస్తుందని.. జులైలో వారికి పరీక్షలు ఉంటాయని.. 31 జులై వరకూ వారికి స్టైఫండ్ ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చదవండీ... Audio viral: నెల్లూరు జీజీహెచ్​లో లైంగిక వేధింపుల కలకలం

ABOUT THE AUTHOR

...view details