జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీల నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ఇక బరిలో ఉండే అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జడ్పీటీసీ అభ్యర్థులు ప్రచారానికి పదునుపెడుతున్నారు. జిల్లాకు సుప్రీం, మంత్రి స్థాయి హోదా ఉండే జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠంపైనే అందరి దృష్టి ఉంది.
జడ్పీ ఛైర్మన్ అధికారాలు ఇవే...
- జిల్లా పరిషత్‌లో జరిగే అన్ని సమావేశాలకు ఛైర్మన్ అధ్యక్షత వహిస్తారు. జిల్లాలో జరిగే అన్ని అధికార కార్యక్రమాలకు ఛైర్మన్‌గా ఆహ్వానం అందుకుంటారు.
- జడ్పీ సమావేశాలు, స్థాయీ సంఘ సమావేశాల తేదీని, సమయాన్ని, ఎజెండాను ఆమోదించే అధికారం ఛైర్మన్‌కు ఉంటుంది.
- జిల్లా గ్రామీణాభివృద్ధిలో భాగంగా పేదరిక నిర్మూలనకు చేపట్టే కార్యక్రమాల్లో జడ్పీ ఛైర్మన్ డీఆర్డీఏ(జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ)ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
- జిల్లా పరిషత్ నిర్వహించే అన్ని దస్త్రాలను పరిశీలించే అధికారం ఉంటుంది.
- ఏ పార్టీతో సంబంధం లేని, ప్రత్యేక విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిని సలహా సంప్రదింపులకు జడ్పీ సమావేశాలకు ఆహ్వానం పలకవచ్చు.
- జిల్లా ఉపాధి కల్పన, నిరుద్యోగులకు ఉపాధి కలిగించేలా చూసే అధికారం ఉంటుంది.
- ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు జిల్లా స్థాయి కమిటీ ఛైర్మన్ హోదాలో పర్యవేక్షించవచ్చు. జిల్లా ఆహార కమిటీ సభ్యుడిగా, ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమ నిర్వహణ లేదా లోపాల సవరణలు చేయవచ్చు.